ప్రకాశ్‌రాజ్ వర్గం మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం? 'మా'కు పోటీగా మరో సంఘం?
on Oct 12, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా మంచు విష్ణు గెలవగా, ఆఫీస్ బేరర్స్‌గా అధిక శాతం మంది ఆయన ప్యానల్ వారే ఎన్నికయ్యారు. అయితే ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో మా కొట్టుమిట్టాడుతోందని ఆరోపిస్తూ, నాగబాబు తన 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయగా, ప్రెసిడెంట్‌గా పోటీచేసి, ఓటమి పాలైన ప్రకాశ్‌రాజ్ సైతం అదే బాట అనుసరించారు. అయితే ఆ ఇద్దరి రాజీనామాలను తాను ఆమోదించడం లేదని విష్ణు చెప్పారు.
'మా' ఎన్నికలు భుజబలం, ధనబలం ప్రభావంతో జరిగాయనీ, మా భవిష్యత్తు తలచుకుంటుంటే భయమేస్తోందంటూ ఓ బహిరంగ లేఖ రాయడం ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. లేటెస్ట్గా ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మెంబర్స్ కూడా ఆయన బాటలో రాజీనామాలు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారంలోకి వచ్చింది. ఈరోజు సాయంత్రం వారంతా కలిసి మీడియా మీట్‌ను ఏర్పాటు చేయడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.
ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ స్వీప్ చేస్తుందని పది రోజుల క్రితం వరకూ అనుకున్నారు. కారణం.. ఆ ప్యానల్‌కు మెగా కాంపౌండ్ ఆశీస్సులు, అండదండలు ఉండటం! కానీ.. మారిన పరిణామాల నేపథ్యంలో తెలుగువాడు కాని ప్రకాశ్‌రాజ్‌ను కాకుండా తెలుగుబిడ్డ అయిన మంచు విష్ణువైపే 'మా' సభ్యుల్లో ఎక్కువమంది మొగ్గు చూపారు. ఫలితంగా.. 107 ఓట్ల భారీ మెజార్టీతో ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు గెలిచాడు. ఆఫీస్ బేరర్లలో 6 మంది ఆయన ప్యానల్ వారు ఉండగా, ఇద్దరు మాత్రమే ప్రకాశ్‌రాజ్ వర్గీయులు. అలాగే 18 మంది ఈసీ మెంబర్స్‌లో 10 మంది విష్ణు వర్గీయులు అయితే, 8 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానల్ వారు.
ఏదేమైనా, 'మా' ఎన్నికలు ఈ రీతిలో వివాదాస్పదం అవడం గతంలో ఎన్నడూ చూడని అనుభవం. సాయంత్రం ప్రెస్ మీట్లో ప్రకాశ్‌రాజ్ వర్గీయులు ఏం బాంబు పేలుస్తారోనని అంతా ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వారంతా రాజీనామా చేస్తే, మా పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఉన్న 'మా'కు పోటీగా మరో అసోసియేషన్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉందంటున్నారు. అయితే దానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అత్యున్నత బాడీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ గుర్తింపు లభిస్తుందా అనేది ప్రశ్న.