అప్పుడు 'బిల్లా'.. ఇప్పుడు 'సాహో'!
on Aug 31, 2019

'బాహుబలి' ఫ్రాంచైజ్‌తో టాలీవుడ్ హిస్టరీలోనే మరే స్టార్‌కూ రాని విధంగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్, ఆ ఫ్రాంచైజీ తర్వాత, ఆ ఇమేజ్‌కు తగ్గ సినిమా చెయ్యడంలో విఫలమయ్యాడు. శుక్రవారం రిలీజైన 'సాహో' సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, ఆ సినిమా చేసినందుకు ప్రభాస్‌కు బ్యాడ్ నేం కూడా తీసుకొచ్చింది. అసలు ఏం చూసి ప్రభాస్ 'సాహో' మూవీ చేశాడనే ప్రశ్న ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచీ, అటు ప్రేక్షకుల నుంచీ వస్తోంది. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ సైతం సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌కు శాటిస్‌ఫై అయినా, ఓవరాల్‌గా మూవీపై పెదవి విరుస్తున్నారు.
"సుజిత్ స్టోరీ చెప్పినప్పుడు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడు. ఎందుకంటే.. అంత ఇంట్రెస్టింగ్‌గా స్టోరీని సుజిత్ నెరేట్ చేశాడు. కానీ స్క్రీన్‌పై అదే తరహా నెరేషన్ చూపించడంలో సుజిత్ ఫెయిలయ్యాడు. ఇందులో ప్రభాస్ తప్పేమీ లేదు" అని ప్రభాస్ వీరాభిమాని ఒకరు చెప్పాడు. బహుశా అది నిజం కూడా కావచ్చు. కానీ ప్రభాస్ ఇప్పటికే 'బిల్లా' వంటి గ్యాంగ్‌స్టర్ మూవీ చేశాడు. హిందీలో అమితాబ్ చేసిన సూపర్ హిట్ ఫిల్మ్ 'డాన్'కు అది రీమేక్ అనే విషయం తెలిసిందే. షారుఖ్ ఖాన్ చేసిన హిందీ రీమేక్ 'డాన్', అజిత్ చేసిన తమిళ్ రీమేక్ 'బిల్లా'.. రెండూ సూపర్ హిట్ అయినా, ప్రభాస్ చేసిన 'బిల్లా' మాత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గానే కలెక్షన్లను సంపాదించింది. ఈ అసంతృప్తి ప్రభాస్‌లో అలాగే ఉండిపోయింది.
ఇప్పుడు సుజిత్ చెప్పిన గ్యాంగ్‌స్టర్ స్టోరీ చెయ్యడానికి ఇదే దోహదం చేసిందని ప్రభాస్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈసారి ఎలాగైనా గ్యాంగ్‌స్టర్ మూవీతో హిట్ కొట్టాలనే తపన వల్లే 'సాహో'కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న మాట. కానీ ఇక్కడే అతను ఒక విషయం విస్మరించాడు. ఎమోషనల్ సీన్స్ ఉన్న 'బిల్లా'యే ఆశించిన రీతిలో ఆడనప్పుడు, ఎమోషనల్‌గా చాలా వీక్‌గా ఉన్న 'సాహో' స్టోరీ.. ఆడియెన్స్‌కు ఎలా కనెక్టవుతుందని ప్రభాస్ నమ్మాడు? యాక్షన్ ఎపిసోడ్స్ చాలా స్టైలిష్‌గా తీసిన డైరెక్టర్ మెహర్ రమేశ్, స్క్రీన్‌ప్లే విషయంలో చేసిన తప్పుల కారణంగా 'బిల్లా' యావరేజ్ మూవీ అయ్యింది.
'సాహో'లో యాక్షన్ ఎపిసోడ్స్‌కు నిర్మాతలు మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టారు. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్‌కే 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యిందని అంచనా. ఈ ఎపిసోడ్స్‌లో ఎన్నో వాహనాలను, సెట్ ప్రోపర్టీని ధ్వంసం చేశారు. అత్యాధునిక కెమెరాలతో, హై టెక్నికల్ ఎక్విప్‌మెంట్‌తో యాక్షన్ సీన్స్ తీశారు. ఆ తర్వాత వాటికి వీఎఫ్ఎక్స్ జోడించారు. దాంతో ఖర్చు తడిపి మోపెడయ్యింది. స్టోరీ పరంగా చూసుకుంటే.. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ మినహాయిస్తే, స్టోరీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకేముంది? స్క్రీన్‌ప్లే కూడా టైట్‌గా ఎక్కడ నడిచింది?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



