లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన బోల్డ్ యాక్ట్రెస్ అరెస్ట్
on May 11, 2020
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై ఆదివారం నటి పూనమ్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా మే 17 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఎలాంటి కారణం లేకుండా పూనమ్, ఆమె బాయ్‌ఫ్రెండ్ సామ్ అహ్మద్ బాంబే (46) కలిసి రోడ్ల మీద తిరుగుతుండటంతో ఐపీసీ 188, 269, 51 (బి) సెక్షన్ల కింద ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ట్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అంతేకాదు, వాళ్ల బీఎండబ్ల్యు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రభుత్వోద్యోగి ఆజ్ఞను అగౌరవపరచడం, నేషనల్ డిజాస్టర్ యాక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
2013లో వచ్చిన నషా సినిమాతో పూనమ్ పాండే వార్తల్లో నిలిచింది. తన విద్యార్థుల్లో ఒకరితో లైంగిక సంబంధం పెట్టుకొనే టీచర్ పాత్రను ఆ సినిమాలో ఆమె పోషించింది. 2015లో మాలిని అండ్ కో అనే తెలుగు సినిమాలో నటించిన పూనమ్ రెండేళ్ల క్రితం శక్తి కపూర్‌తో కలిసి ద జర్నీ ఆఫ్ కర్మ అనే బాలీవుడ్ మూవీలో నటించింది. బోల్డ్ సీన్లు చేయడం, బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడం, సోషల్ మీడియాలో బోల్డ్ వీడియోలు షేర్ చేయడం ద్వారా వివాదాస్పద నటిగా పూనమ్ పేరు పొందింది.