పొలిటికల్ సునామీ సృష్టిస్తున్న బోయపాటి 'స్కంద'!
on Sep 28, 2023

బోయపాటి శ్రీను సినిమాల్లో పొలిటికల్ టచ్, పొలిటికల్ డైలాగ్స్ కొత్త కాదు. అయితే ఆయన తాజా చిత్రం 'స్కంద'లో ఆ డోస్ మరింత పెరిగింది. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, సంభాషణలు కొందరు రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి.
రామ్ పోతినేని హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'స్కంద'. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇందులోని కొన్ని పొలిటికల్ సీన్స్, డైలాగ్స్ హాట్ టాపిక్ గా మారాయి. సినిమా చూసి థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులు.. వాటి గురించే తెగ చర్చించుకుంటున్నారు.
ఈ సినిమాలో శ్రీకాంత్ పోషించిన వ్యాపార దిగ్గజం రామకృష్ణరాజు పాత్ర సత్యం రామలింగరాజుని గుర్తు చేస్తుంది. కొందరు రాజకీయ నాయకుల స్వార్థం వల్లే అంతటి గొప్ప వ్యక్తి జైలు పాలయ్యాడు అన్నట్లుగా సినిమాలో చూపించారు.
అలాగే సినిమా ప్రారంభంలో.. పెళ్ళి పీటల మీద నుంచి సీఎం కూతురు లేచిపోతుంది. దాంతో సీఎం కుటుంబ పరువు కోసం తన సొంత మామను చంపి, గుండెపోటు అని నమ్మించి.. పెళ్ళి ఆగిపోయిందని చెప్పి, వచ్చిన అతిథులను వెనక్కి పంపించేస్తాడు. ఈ సన్నివేశం ఓ సంచలన ఘటనను గుర్తు చేస్తుందని మాట్లాడుకుంటున్నారు.
ఇక ఒక సన్నివేశంలో కమెడియన్ రచ్చ రవి చెప్పిన డైలాగ్స్.. అరాచకాలు సృష్టించి, అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేసే ఒక రాజకీయ వ్యూహకర్తను అడ్డుపెట్టుకొని,.. అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ నాయకుడిని గుర్తు చేస్తుంది అంటున్నారు. "మంచిగా ఉన్న నీళ్లలో బురద వేస్తాం. మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తాం. గొప్ప నాయకుడిని చెడ్డవాడిగా, చెడ్డ వాడిని గొప్ప నాయకుడిగా చిత్రీకరిస్తాం. ఉచితాలు పేరుతో మోసం చేస్తాం. ముందు కొంచెం గడ్డి వేసి, వెనక మొత్తం పాలు పిండుకుంటాం." అంటూ రచ్చ రవి చెప్పిన లెన్తీ డైలాగ్ రాజకీయ సంచలనం సృష్టించేలా ఉందని చర్చించుకుంటున్నారు. అంతేకాదు పృథ్వీరాజ్ పోషించిన రాజకీయ వ్యూహకర్త పాత్ర కూడా నిజ జీవితంలోని ప్రముఖ వ్యూహకర్తను గుర్తు చేసేలా ఉందని చెప్పుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



