దర్శకుడు గీతాకృష్ణపై కేసు నమోదు.. విచారణకు సిద్ధమైన ఏపీ పోలీసులు!
on Mar 13, 2025
గత కొన్నేళ్లుగా అందరూ మీడియాను, సోషల్ మీడియాను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అన్నింటినీ మించి కాంట్రవర్సీలంటే పడి చస్తున్నారు. అలాంటి వార్త ఎక్కడ కనిపించినా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. మంచి కంటే చెడు త్వరగా వ్యాప్తిస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి కనిపించదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్.. అవాకులు, చవాకులు పేలే కొందర్ని ఎంపిక చేసుకొని వారితో ఉన్నవీ, లేనివీ డిస్కస్ చేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేసే పనిలో ఉంటున్నాయి. వాస్తవంగా జరిగిన విషయం ఒకటైతే, దాన్ని మరో కోణం నుంచి చూస్తూ దానికి కొత్తర్థాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న దర్శకనిర్మాతలు, టెక్నీషియన్స్ వారి అనుభవాలను తెలియజేసే కార్యక్రమంలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో తమ అనుభవాలను తెలియజేయడమే కాకుండా పనిలో పనిగా తమకు నచ్చనివారిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు సీనియర్ జర్నలిస్ట్ అనే ముసుగు వేసుకొని యూట్యూబ్‌లో ప్రత్యక్షమవుతున్నారు. సినిమా రంగంలోని పాతతరం వారి గురించి ప్రస్తావిస్తూ.. వారి జీవితంలో జరిగిన ఘటనలను తాము పక్కనే ఉండి చూసినంతగా ప్రేక్షకుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈమధ్యకాలంలో యూట్యూబ్‌లో తన ఇంటర్వ్యూలతో అలజడి సృష్టిస్తూ.. కాదెవరు విమర్శకు అనర్హం అన్నట్టుగా సినిమా సెలబ్రిటీస్ అందర్నీ ఏకి పారేస్తూ.. వారిని దుర్భాషలాడుతూ రకరకాల పద విన్యాసాలతో విరుచుపడుతున్నారు దర్శకుడు గీతాకృష్ణ. అతను మాట్లాడే వీడియోలకు థంబ్ నెయిల్స్ కూడా విచిత్రంగా పెడుతూ ప్రేక్షకుల్ని ఆకర్షించే పనిలో ఉంటున్నాయి యూ ట్యూబ్ ఛానల్స్. ముఖ్యంగా హీరోయిన్ల గురించి గీతాకృష్ణ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నాయి. కొంత మంది హీరోయిన్ల గురించి మరీ దారుణంగా మాట్లాడే గీతాకృష్ణకు షాక్ తగిలింది. విశాఖపట్నం ఉమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గీతాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ సభ్యులు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీని కలిసి గీతాకృష్ణ చేస్తున్న ఆగడాలను వివరించి కంప్లయింట్ ఇచ్చారు. పలు యూట్యూబ్ ఛానల్స్‌లో అతను ఇస్తున్న ఇంటర్వ్యూల గురించి, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో నటీనటులపై చేస్తున్న తీవ్రమైన విమర్శల గురించి, వారిపై చేస్తున్న ఆరోపణల గురించి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టి గీతాకృష్ణపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీంతో గీతాకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
