ఏయన్నార్ ఎదిగిన క్రమం.. నవతరానికి మార్గదర్శనం: పవన్ కళ్యాణ్
on Sep 20, 2023
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుని అభిమానించే కథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఏయన్నార్ తో పవన్ సినిమా చేయకపోయినా.. తన మొదటి చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'లో అక్కినేని మనవరాలు సుప్రియతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే పవన్ రెండో చిత్రం 'గోకులంలో సీత'కి ఏయన్నార్ క్లాప్ కొట్టారు కూడా. కాగా, నేడు (సెప్టెంబర్ 20) ఏయన్నార్ శతజయంతి సందర్భంగా పవన్.. జనసేన పార్టీ ట్విట్టర్ లో ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏముందంటే..
"తెలుగు చలన చిత్ర చరిత్రలో దివంగత శ్రీ అక్కినేని నాగేశ్వరావు ది ప్రత్యేక అధ్యాయం. సాత్వికాభినయంతో శ్రీ నాగేశ్వరరావు పోషించిన విభిన్నమైన పాత్రలను సినీ ప్రియులు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆ మహానటుడి శత జయంతి వేడుకలు నేడు మొదలైన సందర్భంలో మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను. ఒక దేవదాసు.. ఒక మజ్ను.. డాక్టర్ చక్రవర్తి.. దసరా బుల్లోడు.. బాటసారి.. విప్రనారాయణ.. భక్త తుకారం.. బాలరాజు.. సీతారామయ్య గారు.. ఇలా ఏ పాత్ర, ఏ చిత్రం ప్రస్తావించుకున్నా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి అభినయం కళ్ళలో మెదులుతుంది. మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్ ఆయన. స్వతహాగా నాస్తికత్వాన్ని విశ్వసించినా వెండితెరపై భక్తి భావనలు పంచే పాత్రల్లో ఒదిగిపోయిన విధానం ఒక నటుడు పాత్రను ఎంతగా జీర్ణించుకోవాలో ఆయన చిత్రాల ద్వారా తెలుస్తుంది. కరుణ రస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైనది. ప్రేమకథలకు, నవలా చిత్రాలకు చిరునామాగా నిలిచారు. కృషి, పట్టుదలతో చలన చిత్ర సీమలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎదిగిన క్రమం నవతరానికి మార్గ దర్శనం చేస్తుంది."
Also Read