రవితేజా అత్యాశ!
on Oct 25, 2017
అంచనాలను.. ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే కాంబినేషన్లు కొన్ని ఉంటాయ్. అవి కనుక సెట్ అయితే... జనాల ఊహలతో వంద కథలు అల్లేయొచ్చన్నమాట. అలాంటి కాంబినేషనే పవన్ కల్యాణ్, రవితేజా. వీరిద్దరికీ ఓ సంబంధం ఉంది. అదేంటంటే... పవన్ కాదనుకున్న కథ ‘ఇడియట్ ’తోనే రవితేజా స్టార్ అయ్యాడు. పవన్ వదులుకున్న ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ్’ సినిమానే రవితేజా కెరీర్ కు బలమైన పునాదిగా నిలిచింది. ఆ విధంగా పవన్.. ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా రవితేజాకు సహాయపడ్డాడు.
ఇప్పుడు వీరిద్దరి టాపిక్ ఎందుకొచ్చిందా? అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. ‘రాజా ది గ్రేట్’ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీదున్న మాస్ మహారాజా.. మీడియాకు ఇంటర్ వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘మల్టీస్టారర్ చేయాల్సివస్తే... ఏ హీరోతో కలిసి చేయడానికి ఇష్టపడతారు?’ అని ఓ జర్నలిస్ట్ అడిగితే... ఠపీమని ‘పవన్ కల్యాణ్’ అని సమాధానం ఇచ్చేశాడు రవితేజా. ఇంకా చెబుతూ ‘ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇధ్దరి కాంబినేషన్ అయితే... జనాలు బాగా ఎంజాయ్ చేస్తారని నా అభిప్రాయం. కానీ... అన్నీ కుదరాలి కదా!’ అని ముగించాడు.
రవితేజా కోరిక సమంజసంగానే ఉన్నా.. ఆ కోరిక తీరే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. పవర్ స్టార్ ఇమేజ్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఓ విధంగా ఇప్పుడున్న హీరోలందరిలో అత్యధిక అభిమానగణం ఉన్న హీరో పవన్ కల్యాణే. సో.. ఇలాంటి సూపర్ స్టార్ తో రవితేజాకు సమానమైన పాత్ర దొరకడం ముందు అసంభవం. ఇక రెండో విషయం ఏంటంటే... ప్రస్తుతం పవన్.. సినిమాలపై కంటే.. రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అంతేకాదు... సినిమాలను క్రమక్రమంగా తగ్గించుకుంటున్నాడు కూడా. ఇలాంటి తరుణంలో రవితేజా కోరిక తీరుతుందనుకోవడం నిజంగా కామెడీనే అవుతుంది. అయితే.. రవితేజా ఊహ మాత్రం చాలా బావుంది. నిజంగా వారిద్దరి కాంబినేషన్ కుదిరితే... బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయమే.