పవన్..ఆదుకోవయ్యా ప్లీజ్..!
on Apr 14, 2016

పవన్ కల్యాణ్ మంచితనం గురించీ.. తనలోని నిజాయతీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించ వలసిన అవసరం లేదు. అసలు పవన్ చుట్టూ ఇంతమంది అభిమానులున్నారంటే, జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్‌ని దేవుడిలా కొలుస్తున్నారంటే దానికి కారణం... తనలోని నిజాయతీ, డబ్బు కంటే నిజాయతీకి ప్రాముఖ్యత ఇచ్చే మనిషి పవన్ అని తన గురించి తెలిసినవాళ్లంతా అంటారు. అందుకే.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో అయినా, అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయకుడైనా... ఇప్పటి వరకూ ఆర్థికంగా స్థిరపడలేకపోయాడు. జానీ సినిమా ఫ్లాప్ అయినప్పడు, బయ్యర్లు పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆదుకొన్నాడు పవన్. తన పారితోషికాన్ని సైతం వెనక్కి ఇచ్చి.. అప్పట్లో సంచలనం సృష్టించాడు.
సర్దార్‌కీ ఇప్పుడు అదే పరిస్థితి దాపురించింది. ఈ సినిమాకొచ్చిన హైప్ చూసి, పవన్ స్టార్ డమ్ చూసి, గబ్బర్ సింగ్ టైటిల్ చూసి బయ్యర్లు అంతకు పడితే అంతకు ఈ సినిమా కొనేశారు. బాహుబలి రేట్లకు మించిన బిజినెస్ జరిగింది సర్దార్‌కు. తీరా చూస్తే... రెండో రోజే థియేటర్లు ఖాళీ అయ్యాయి. చాలా ఏరియాల్లో ఇప్పుడు డెఫిషిట్‌తో సినిమా నడుస్తోంది. కోట్లు పోసి కొన్న బయ్యర్లు ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఎదురైంది. సగానికి సగంపోయే ఛాన్సుందని ట్రేడ్ వర్గాలు లెక్కగట్టేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపులూ ఇప్పుడు పవన్ కల్యాణ్‌పై పడ్డాయి. జానీ సమయంలో ఎలా ఆదుకొన్నాడో.. ఇప్పుడూ పవన్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కష్టాలు తీర్చాలని బయ్యర్లు కోరుకొంటున్నారు. పైగా ఈ సినిమాకి పవన్ నిర్మాణ భాగస్వామి కూడా. చిత్ర నిర్మాత శరత్ మరార్‌కి మంచి మిత్రుడు. పవన్ ఏం చెబితే శరత్ మరార్ అది వింటాడు. కాబట్టి... నష్టాన్ని భర్తీ చేసేందుకు పవన్ ముందుకు రావాలని బయ్యర్లు కోరుకొంటున్నారు.
ఈ సినిమా నష్టపోతే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వం అని నిర్మాత - పంపిణీదారుల మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. అయితే.. పవన్ పెద్ద మనసు చేసుకోవాల్సిన తరుణమిది. కేవలం పవన్‌పై నమ్మకంతో, పవన్ ఇమేజ్‌పై ఉన్న గురితోనే బయ్యర్లు ఈ సినిమా భారీ రేట్లకు కొన్నారు. ఇప్పుడు అదే పవన్ పై ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. పవన్‌తో కొంతమంది బయ్యర్లు నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ విషయంలో పవన్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నాడని, ఏరియాల వారిగా వసూళ్ల జాబితాని పవన్ రప్పించుకొన్నాడని, ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకొంటాడని తెలుస్తోంది. నిజంగానే సర్దార్‌తో నష్టపోయిన బయ్యర్లను పవన్ ఆదుకోంటే మరోసారి వారందరి దృష్టిలో పవన్ దేవుడైపోవడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



