100 కోట్ల క్లబ్ లో పవన్ కళ్యాణ్.. ఇది కదా పవర్ స్టార్ రేంజ్ అంటే!
on May 31, 2023
పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న కొందరు తెలుగు స్టార్స్ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ ఫీట్ సాధించడం విశేషం. ప్రస్తుతం పవన్ నటిసున్న 'ఓజీ' కోసం ఆయన ఏకంగా వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. 'ఆర్ఆర్ఆర్' వంటి సంచలన విజయం తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. గ్యాంగ్ స్టర్ మూవీగా తెరకెక్కుతోన్న 'ఓజీ'పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం అనౌన్స్ పోస్టర్, సెట్స్ నుంచి విడుదలైన ఫొటోలతోనే అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాపై నిర్మాత డీవీవీ దానయ్య సైతం అంతకుమించిన నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కి ఏకంగా వంద కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలకానప్పటికీ, ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం పవన్ కే సాధ్యమవుతుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అంతేకాదు ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇస్తున్నప్పటికీ, డీవీవీ దానయ్యలో ఏమాత్రం ఆందోళన లేదట. ఎందుకంటే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ కోసమే ఈ సినిమాకి రికార్డు స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయట. థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో విడుదలకు ముందే ఆయన భారీ లాభాలను పొందే అవకాశముంది అంటున్నారు.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.