పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి కన్ఫర్మ్ చేశాడు
on Jan 31, 2020
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పింక్ రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించే సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. రేపో మాపో ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవుతుంది. అయితే... నిన్నటి వరకు పవన్ నోటి వెంట సినిమా మాట రాలేదు. సినిమాల గురించి ఎవరు ప్రస్తావించిన పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. జనసేన పార్టీలో నుండి జేడీ లక్ష్మీనారాయణ బయటకు వెళ్లడం... వెళుతూ వెళుతూ జనసేనాని సినిమాలు చేస్తున్న కారణంగా పార్టీ నుండి వైదొలగుతున్నట్టు ప్రకటించడంతో... తాను చేస్తున్న సినిమాల గురించి పవన్ స్పందించక తప్పలేదు.
జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తూ పవన్ విడుదల చేసిన లేఖలో సినిమాల గురించి ప్రస్తావించారు. తనకు పవర్ ప్రాజెక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, అధిక వేతనం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం లేని కారణంగా తన పై ఆధారపడి జీవించే కుటుంబాల కోసం, తన కుటుంబం కోసం సినిమాలు చేయడం తప్పనిసరి అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అసలు సినిమాలు చేయనని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే తొలిసారి ఆయన నోటి వెంట సినిమాలు చేయడం తప్పనిసరి అనే మాట వచ్చింది. సినిమాలు చేస్తున్నట్టు స్పష్టత కూడా వచ్చింది.