గురువు హుస్సైనీ మృతిపై పవన్ స్పందన ఇదే..విదేశాలకి పంపించేవాడ్ని
on Mar 25, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి కరాటే,కిక్ బాక్సింగ్ వంటి పలు మార్షల్ఆర్ట్స్ ని నేర్పించిన గురువు 'షిహాన్ హుసైని'(Shihan Hussaini)ఈ రోజు ఉదయం బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతు చెన్నైలో చనిపోయిన విషయం తెలిసిందే.భారతీయ కరాటే నిపుణుడుగా ఎంతో పేరు సంపాదించుకున్న షిహాన్ ఆర్చరీ రంగంలోను ఎంతో మందిని తయారు చేసాడు.
ఆయన మృతి పై పవన్ కళ్యాణ్ అధికారకంగా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చెయ్యడం జరిగింది.ప్రముఖ మార్షల్ ఆర్ట్స్(Marshal Arts)ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను.నేను హుస్సైనీ గారి వద్దే కరాటే శిక్షణ పొందాను.ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది.వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేశాను.విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉందంటే,అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పాను.ఈ నెల 29వ న చెన్నై వెళ్ళి హుస్సైనీ గారిని పరామర్శించాలని కూడా అనుకున్నాను.ఇంతలోనే దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం.హుస్సైనీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
హుస్సైనీ గారు కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు.ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని.అసలు ఫస్ట్ లో నాకు కరాటే నేర్పేందుకు ఆయన ఒప్పుకోలేదు.'ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు' అన్నారు.ఎంతో బతిమాలితే ఒప్పుకొన్నారు.తెల్లవారుజామునే వెళ్ళి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను.తమ్ముడు చిత్రంలో నా పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకొనేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు,నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి.హుస్సైనీ గారి శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు.తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కూడా ఆయన కృషి చేశారు.ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు.
హుస్సైనీ గారి ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులతో పాటు శిల్పి కూడా.పలు చిత్రాల్లో కూడా నటించిన అయన స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు.చెన్నై రోటరీ క్లబ్, ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకువెళ్ళేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుస్సైనీ గారు మార్షల్ ఆర్ట్స్ ను యువతీయువకులకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయాలని ప్రకటించడం,ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడిస్తుంది.హుస్సైనీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాని అందులో తెలిపాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
