అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా కృష్ణవంశీ సినిమా!
on Mar 25, 2025
టాలీవుడ్ దర్శకుల్లో కృష్ణవంశీది ఒక ప్రత్యేకమైన శైలి. ఒకే తరహాలో సినిమాలు చేయకుండా ఒక్కో సినిమా ఒక్కో జోనర్‌లో ఉండేలా చూసుకుంటారు. ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలూ డిఫరెంట్ జోనర్సే. కృష్ణవంశీకి దేశభక్తి ఎక్కువ. ఆ విషయం ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రిలీజ్ అయి 20 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఖడ్గం చిత్రానికి విపరీతమైన ఆదరణ లభిస్తూనే ఉంది. విభిన్నమైన కథ ఉంటే తప్ప సినిమా చెయ్యని కృష్ణవంశీకి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది. దీనికి సంబంధించిన స్కోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌తో కలిసి ఇటీవల అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి వెళ్లారు. స్థానికంగా ఉన్న నేను సైతం ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కుసిరెడ్డి శివతో కలిసి అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులు ఉన్న పార్కును సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యండమూరి వీరేంద్రనాథ్, కృష్ణవంశీ మాట్లాడారు.
యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ ‘కృష్ణవంశీ గొప్ప దేశ భక్తుడు. అల్లూరి సమాధి వద్ద మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి నమస్కారం చెయ్యడం అనేది ఆయన దేశభక్తికి నిదర్శనంగా కనిపించింది. ఆ క్షణం ఆయన దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమా గుర్తు వచ్చింది. దేశభక్తి కలిగిన అద్భుతమైన చిత్రాలను కృష్ణవంశీ తెరకెక్కించారు’ అన్నారు.
దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ ‘అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రాంతాలను సందర్శించాలనే కోరిక ఎన్నో ఏళ్లుగా ఉంది. అది ఈరోజు తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. పత్రికా సంపాదకుడైన గోకరాజు నారాయణరావు అల్లూరి జీవితంపై 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ‘ఆకుపచ్చ సూర్యోదయం’ అనే పుస్తకాన్ని రాశారు. అది చదివిన తర్వాత అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ప్రదేశాలను చూడాలనే పట్టుదల నాలో పెరిగింది. అల్లూరి జీవితంపై వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించి సినిమాగా రూపొందించాలని ప్రయత్నిస్తున్నాను’ అన్నారు.
అనంతరం నేను సైతం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొయ్యూరు మండలంలో నివాసం ఉంటున్న అల్లూరి ప్రధాన అనుచరుడు గంటం దొర కుటుంబ సభ్యులను కలిసి వారికి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేనుసైతం వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివ పాల్గొన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
