రాజమౌళికి ఆ అర్హత ఉందా?
on Jan 26, 2016

పద్మశ్రీ రాజమౌళి.... ఈ పిలుపు ఇప్పుడు కొత్త కొత్తగా వినిపిస్తోంది. నిజానికి రాజమౌళికి పద్మశ్రీ ఇంత త్వరగా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆఖరికి రాజమౌళి కూడా! తెలుగు సినిమాని మరో లెవిల్‌కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహుబలితో.. టాలీవుడ్‌ని బాలీవుడ్‌కి పోటీగా నిలిపాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. వరుస విజయాలతో బాక్సాఫీసు బొనంజాలను అందించాడు. తెలుగు చిత్రసీమలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించాడు. ఇదంతా.. రాజమౌళి ఘనత.. కాదనలేం. అయినప్పటికీ పద్మశ్రీ ఇవ్వడం షాకింగే. రాజమౌళి గొప్పోడే. కానీ కె.విశ్వనాథ్ అంత కాదుగా! శంకరాభరణం, సాగర సంగమం,స్వాతిముత్యం, స్వయంకృషి.. ఇవన్నీఅద్భుతాలు కాదా..? వీటిలో ఒక్క సినిమా అయినా.. బాహుబలి, మగధీరలకు సాటిరాదా?? రాజమౌళి చేతిలో వయసుంది.. జోష్ ఉంది... భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు. కానీ... కె.విశ్వనాథ్ అలా కాదుగా. ఆయన పనిచేసినంత కాలం చేశారు.. ఇప్పుడు అలసిపోయారు. కనీసం ఇప్పుడైనా ఆయన్ని గౌరవించుకోవాలి కదా? టెక్నికల్ విషయాలనే పద్మశ్రీ జ్యూరీ గుర్తించింది అనుకొందాం.
తమిళ నాట శంకర్ రాజమౌళి కంటే.. ముందే ఉన్నాడు కదా? రాజమౌళి తీసినవన్నీ ఫక్తు కమర్షియల్ చిత్రాలు.. కానీ శంకర్ అలా కాదు కదా? ఓ సామాజిక నేపథ్యమున్న కథని.. కొత్త కోణంలో చెప్పడానికి ప్రయత్నించాడు. అంతెందుకు... రాజమౌళి గురువు.. రాఘవేంద్రరావు మాటేంటి? ఆయన టచ్ చేయని కమర్షియల్ కోణం ఉందా? అలాగని అవే సినిమాలూ తీయలేదు. జ్యోతి, బాబు, దేవత.. ఇలా చెదరని జ్ఞాపకాల్ని అందించారు. అన్నమయ్యతో భక్తి సాగరంలో ముంచెత్తారు. ఇవన్నీ రాజమౌళి సినిమాల ముందు ఆనలేదా? చూస్తుంటే.. అవార్డు జ్యూరీ కూడా బాహుబలి ఫీవర్‌లోనే ఉన్నట్టు అనిపిస్తోంది. రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్... వీళ్లంతా లెజెండ్స్. ముందు వీళ్లని గౌరవించుకొన్న తరవాతే.. మిగిలినవాళ్లు. ఆ విషయం జ్యూరీకి అర్థం కాకపోయినా రాజమౌళికి మాత్రం అర్థమైంది. అందుకే.. `ఈ అవార్డుకు నేను సరిపోనేమో అనిపిస్తోంది` అంటూ.. నిజాయతీగా మాట్లాడాడు. పోనీలెండి.. ఆ సంగతి రాజమౌళికైనా అర్థమైంది. ఎనీవే.. పద్మశ్రీ అందుకోబోతున్న దర్శక ధీర రాజమౌళికి స్పెషల్... స్పెషల్ కంగ్రాట్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



