'ఓరి దేవుడా' మూవీ రివ్యూ
on Oct 21, 2022
సినిమా పేరు: ఓరి దేవుడా
తారాగణం: విష్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, వెంకటేశ్ కాకుమాను, వెంకటేశ్ (గెస్ట్ అప్పీరెన్స్), రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, నాగినీడు, రాజశ్రీ నాయర్, జీవన్ కుమార్, జయలలిత, సంతోష్ ప్రతాప్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
మ్యూజిక్: లియో జేమ్స్
సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న
ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు
నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి
రచన-దర్శకత్వం: అశ్వథ్ మారిముత్తు
బ్యానర్: పీవీపీ సినిమా
విడుదల తేదీ: 21 అక్టోబర్ 2022
రెండేళ్ల క్రితం తమిళంలో వచ్చిన 'ఓ మై కడవులే' మూవీని అక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించారు. అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ఆ మూవీని అశ్వథ్ మారిముత్తు డైరెక్ట్ చేశాడు. మోడరన్ గాడ్‌గా విజయ్ సేతుపతి చేశాడు. ఇప్పుడు అదే మూవీ 'ఓరి దేవుడా' పేరుతో తెలుగులో రీమేక్ అయ్యింది. ఒరిజినల్‌ను తీసిన మారిముత్తు ఈ మూవీని కూడా రూపొందించాడు. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో దేవుడి క్యారెక్టర్‌ను వెంకటేశ్ చేయడం ప్రేక్షకుల్లో విడుదలకు ముందు ఆసక్తిని రెకెత్తించింది. పీవీపీ సినిమా ప్రొడ్యూస్ చేసిన 'ఓరి దేవుడా' ఎలా ఉందంటే...
కథ
కలిసి చదువుకున్న అర్జున్ (విష్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్), మణి (వెంకటేశ్ కాకుమాను) చిన్నప్పట్నుంచీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎలాంటి అరమరికలు లేకుండా వాళ్ల మధ్య స్నేహం వెల్లి విరుస్తుంది. మిగతా ఇద్దరితో పోలిస్తే అర్జున్ చదువులో వీక్. అందుకే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యాక సప్లిమెంటరీ రాసి, ఇంజనీరింగ్ పాసయ్యాననిపించుకుంటాడు. తల్లి లేని అనుకు పెళ్లి చెయ్యాలని ఆమె తండ్రి (మురళీశర్మ) సంకల్పిస్తాడు. అర్జున్‌పై అనుకు లవ్ ఫీలింగ్స్ ఉంటాయి. అందుకే "మనం పెళ్లి చేసుకుందామా?" అనడుగుతుంది. "మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మనకి పెళ్లేమిటి?" అని అర్జున్ తెగ నవ్వేస్తాడు. కానీ ఆమెకు నో చెప్పడానికి ఎలాంటి రీజన్ కనిపించక, చివరకు పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇద్దరికీ పెళ్లయిపోతుంది.
కట్ చేస్తే.. ఏడాది గడిచాక ఇద్దరూ విడాకుల కోసం ఇద్దరూ ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కుతారు. వాళ్లిద్దరికీ విడాకులు మంజూరు కావని, ఆ కోర్టులో ఓ వ్యక్తి (రాహుల్ రామకృష్ణ) అర్జున్‌కు చెప్తాడు. తమ గురువు దగ్గరకు వస్తే పనవుతుందని ఓ విజిటింగ్ కార్డు కూడా ఇస్తాడు. అతను చెప్పినట్లే అక్కడ ఘటనలు జరిగి అను కళ్లుతిరిగి పడిపోతుంది. సాయంత్రం 4 గంటలకు ఆ కేసును మళ్లీ విచారిస్తామని జడ్జి చెప్తుంది. దాంతో అపరిచిత వ్యక్తి ఇచ్చిన అడ్రస్ ప్రకారం లవ్ కోర్ట్‌కు వెళ్తాడు అర్జున్. అక్కడ అతనికి మోడరన్ గాడ్ (వెంకటేశ్) కనిపిస్తాడు. జీవితంలో రెండో చాన్స్ ఇస్తానని, ఆ తర్వాత నీ ఇష్టం అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పినట్లే పెళ్లికి ముందు అను తనకు ప్రపోజ్ చేసిన సన్నివేశం దగ్గరకు కాలం వెనక్కి వెళ్తుంది. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? తను కోరుకున్నట్లు వచ్చిన రెండో అవకాశాన్ని అతను ఎలా ఉపయోగించుకున్నాడు? అతనికి జీవితం ఏం నేర్పింది? తనకంటే రెండేళ్లు సీనియర్ అయిన మీరా పరిచయం అతనికి ఎలాంటి అనుభవాలు ఇచ్చింది? అనుతో అనుబంధం ఏ తీరానికి చేరింది?.. అనే విషయాలను మిగతా కథలో చూస్తాం.
విశ్లేషణ
జీవితంలో రెండో చాన్స్ వస్తే.. అనే పాయింట్‌తో దర్శకుడు అశ్వథ్ మారిముత్తు ఈ సినిమా కథను అల్లుకొన్నాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అయినవాళ్లు పెళ్లి చేసుకుంటే.. వారిలో ఒకరు మరొకరిని రొమాంటిక్ యాంగిల్‌తో చూడకపోతే.. ఆ జీవితం ఎలా ఉంటుందో ఈ కథలో అతను చూపించాడు. పెళ్లికి ముందు అర్జున్, అను మంచి ఫ్రెండ్స్. పెళ్లయ్యాక.. ఇద్దరూ బద్ధ శత్రువులవుతారు. మీరా అనే ఓ అమ్మాయి వాళ్ల జీవితాల్లోకి రావడం కూడా దీనికి ఓ కారణం. నిజానికి మీరా చేసిన తప్పు ఏమీ లేదు. పెళ్లికి ముందు కాలానికి వెనక్కి వెళ్తే.. అర్జున్ ఏం చేస్తాడు? లైఫ్‌లో వచ్చిన సెకండ్ చాన్స్‌ను అతను ఎలా ఉపయోగించుకుంటాడు అనేది.. ఆసక్తికరమైన పాయింట్.
అయితే చక్కని స్క్రీన్‌ప్లే కుదిరితేనే ఆ పాయింట్ తెరపై ఎఫెక్ట్‌వ్‌గా వస్తుంది. ఫస్టాఫ్ అంతా జోవియల్‌గా, బాధ్యతారహితంగా అర్జున్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అలాంటి అర్జున్ సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా మారిపోవడం సినిమాకు ప్లస్సయ్యింది. అనుతో ఫస్టాఫ్‌లో అతను ప్రవర్తించే తీరు వల్ల అర్జున్‌తో కనెక్ట్ కాని మనం, సెకండాఫ్‌లో అందుకు భిన్నంగా అతని ఎమోషన్‌తో మనం కనెక్టవుతాం. అతను ఫీలవుతుంటే, మనమూ ఫీలవుతాం. అతని పెయిన్ మన పెయిన్ అవుతుంది. ఇక్కడే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒరిజినల్ స్టోరీ తనదే కాబట్టి రీమేక్‌లోనూ ఆ ఫీల్ పాడవుకుండా సన్నివేశాల్ని చిత్రీకరించాడు.
పెళ్లికి ముందు అర్జున్, అను, మణి మధ్య స్నేహాన్ని సరదా సన్నివేశాలతో చూపించిన అశ్వథ్.. పెళ్లి తర్వాత వాళ్ల మధ్య గొడవల్ని సహజంగా చూపించే యత్నం చేశాడు. సెకండాఫ్‌లో దేవుడి వల్ల సెకండ్ చాన్స్ పొందిన అర్జున్ పొందే భావోద్వేగాలను కూడా అతను బాగా చూపించాడు. అను తండ్రి చేసే టాయిలెట్ కమోడ్‌ల తయారీ ఇండస్ట్రీని అర్జున్ అసహ్యించుకుంటాడు. అయితే అనుతో పెళ్లయ్యేదాకా ఆయన ఆ ఇండస్ట్రీని నడుపుతున్నాడనే విషయం తెలీనట్లుగా అర్జున్ బిహేవ్ చేయడం సహజంగా లేదు. అయితే తాను ఆ కంపెనీ ఎదుకు పెట్టాడో ఆయన అర్జున్‌కు చెప్పే సీన్ మాత్రం మంచి ఎమోషన్‌కు పనికొచ్చింది. మీరా క్యారెక్టర్ కూడా కథకి టెంపోను తీసుకొచ్చింది.
టెక్నికల్‌గా 'ఓరి దేవుడా' చాలా క్వాలిటీతో ఉంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రాసిన సంభాషణలు సందర్భానుసారం ఎఫెక్టివ్‌గా వచ్చాయి. "నేను చెప్పినా నీకర్థం కాదు" అనే ఊతపదం కథకు లింక్ అవడం మంచి విషయం. క్యారెక్టరైజేషన్స్ ఎలా చక్కగా కుదిరాయో, డైలాగ్స్ కూడా అంతే బాగా కుదిరాయి. లియో జేమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని గాఢతను పెంచింది. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ సీన్లలోని మూడ్‌కు తగ్గట్లు ఉంది. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ షార్ప్‌గా సాగింది.
నటీనటుల పనితీరు
ఈ సినిమాలో నటులందరూ తమ పాత్రలను అర్థం చేసుకొని నటించారు. కాకపోతే అర్జున్ దుర్గరాజ్‌గా నటించిన విష్వక్ సేన్ ప్రథమార్ధంలో కొంచెం ఓవరాక్టింగ్ చేశాడు. ఆ డోస్ కాస్త తగ్గించినట్లయితే అతన్ని ప్రేక్షకులు ఇంకా ప్రేమించేవాళ్లే. రెండు పార్శ్వాలున్న పాత్రలో ఎమోషనల్ యాంగిల్‌ను అతను బాగా చూపించాడు. అంటే సెకండాఫ్‌లో అతను తన నటనతో మనల్ని ఆకట్టుకుంటాడు. అను పాల్‌రాజ్‌గా మిథిలా పాల్కర్ క్యూట్‌గా ఉంది. ఆ క్యారెక్టర్‌లోని పెయిన్‌ను సమర్థవంతంగా ప్రదర్శించింది. మీరా పాత్రలో ఆశా భట్ ఇమిడిపోయింది. చిన్మయి వాయిస్ ఆమెకు ఎస్సెట్. అర్జున్, అను ఫ్రెండ్ మణిగా వెంకటేశ్ కాకుమాను ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత అతనికి మరిన్ని మంచి అవకాశాలు రావడం తథ్యం. అను తండ్రి పాత్రలో మురళీశర్మ ఎప్పట్లా జీవించేశాడు. కీలక సన్నివేశాల్లో తన ప్రెజెన్స్ ఎలాంటిదో తెలియజేశాడు. అర్జున్ తల్లితండ్రులుగా రాజశ్రీ నాయర్, నాగినీడు, మీరా మాజీ బాయ్‌ఫ్రెండ్‌గా సంతోష్ ప్రతాప్, జడ్జిగా జయలలిత, లాయర్‌గా జీవన్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సూటు-బూటుతో కనిపించే ఆధునిక దేవునిగా వెంకటేశ్, సహదేవునిగా రాహుల్ రామకృష్ణ మెరిశారు. నిజానికి దేవుని పాత్రలో వెంకటేశ్‌కు నటించే అవకాశం తక్కువ. కానీ ఆయన ప్రెజెన్స్ సినిమాకు ఓ వెలుగు తెచ్చింది.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
జీవితంలో రెండో అవకాశం వస్తే ఏం చేస్తారనే ఆసక్తికరమైన పాయింట్‌ను అంతే ఆసక్తికరంగా తెరకెక్కించిన 'ఓరి దేవుడా' చిత్రాన్ని హాయిగా తిలకించవచ్చు. చిన్నపాటి పొరపాట్లను వదిలేస్తే.. చక్కని క్యారెక్టరైజేషన్స్, ఆకట్టుకొనే సంభాషణలు, మెప్పించే అభినయాలతో ఓ మంచి సినిమాని చూశాం అనే ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తాం.
రేటింగ్: 3/5
- బుద్ధి యజ్ఞమూర్తి

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
