Home

»

Latest News

O.M: Operation Mole Movie Review: ‘ఓం’ మూవీ రివ్యూ

Nov 20, 2026 11:56AM

నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్, నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్, చైతు జొన్నలగడ్డ, సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ: కె.ఎళిల్ అరసు
ఎడిటింగ్: ఆర్. కళైవాణన్
నిర్మాతలు: ధనుష్, శ్రద్ధ అగర్వాల్, అజ్మత్ జగ్మగ్
బ్యాన‌ర్స్: ఆర్ టేక్ స్టూడియోస్‌, ఉండ‌ర్‌బార్ ఫిలింస్ ప్రై. లిమిటెడ్‌
ర‌చ‌న‌, దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి
విడుద‌ల తేదీ: 20.11.26
సినిమా నిడివి: 178 నిమిషాలు

త‌ను చేసే ప్ర‌తి సినిమా విభిన్నంగా ఉండాల‌ని కోరుకునే ధ‌నుష్ చేసిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ఓం. ఈ సినిమాలో ధ‌నుష్‌తోపాటు మ‌మ్ముట్టి, సాయిప‌ల్ల‌వి, శ్రీ‌లీల‌, న‌సీరుద్దీన్ షా, రేణు దేశాయ్ ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ‘అమరన్‌’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్‌ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ధ‌నుష్‌, రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి సినిమా కావ‌డంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ భారీగానే ఉన్నాయి. 2015 ఏప్రిల్‌ 7న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న 20 మంది కూలీలు పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటనను గుర్తు చేసే నేపథ్యంతో కథ సాగుతుంది. య‌దార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయిందా? ధ‌నుష్ కెరీర్‌లో ఇది మ‌రో వైవిధ్య‌మైన సినిమాగా నిల‌బ‌డుతుందా?  రాజ్‌కుమార్ పెరియ‌స్వామి ఈ సినిమా ద్వారా ఏం చెప్ప‌ద‌లుచు కున్నారు? మ‌మ్ముట్టి పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉంది?  సాయిప‌ల్ల‌వి, శ్రీ‌లీల స్క్రీన్ ప్ర‌జెన్స్ ఆక‌ట్టుకునేలా ఉందా? అనే విష‌యాల గురించి ఈ స‌మీక్ష‌లో తెలుసుకుందాం.

క‌థ:

2015 ఏప్రిల్ 7న తిరుప‌తి స‌మీపంలోని శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగిన 20 మంది కూలీల ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యాన్ని తీసుకొని అల్లిన క‌థ ఇది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌ దుబాయ్‌లో ఉండే అబ్దుల్ హ‌మీద్ (న‌సీరుద్దీన్ షా) సార‌ధ్యంలో జ‌రుగుతుంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కార్తికేయ‌న్‌(మ‌మ్ముట్టి) ఎర్ర‌చంద‌నం క‌లెక్ట్ చేసి పంపిస్తుంటాడు. ఈ స్మ‌గ్లింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు కార్తికేయ‌న్ గ్యాంగ్‌లోకి ప‌ళ‌ని అలియాస్ తిరుకుమర‌న్‌(ధ‌నుష్‌)ను ప్ర‌వేశ‌పెడ‌తారు. ఎఎస్‌పి నిత్యారెడ్డి(సాయిప‌ల్ల‌వి) దిశా నిర్దేశంలో ప‌ళ‌ని త‌న ప‌నిచేస్తుంటాడు. ఈ ఆప‌రేష‌న్‌కి ‘ఆప‌రేష‌న్ మోల్‌’ అని పేరు పెడ‌తారు. ప‌ళ‌ని అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ అనే విష‌యం తండ్రి, భార్య రోజా(శ్రీ‌లీల‌), కొడుకుల‌కు కూడా తెలీదు. ఏజెంట్ డి402గా అక్క‌డ చేరిన ప‌ల‌ని చాలా త‌క్కువ స‌మ‌యంలోనే కార్తికేయ‌న్‌కు రైట్ హ్యాండ్ మార‌తాడు. కార్తికేయ‌న్ పేరుకి స్మ‌గ్ల‌ర్ అయినా మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషి, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఈ వ్యాపారంలోకి దిగుతాడు. వీలైనంత త్వ‌ర‌గా అందులో నుంచి బ‌య‌ట‌ప‌డి ప్రశాంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని అనుకుంటాడు. ఆ స‌మ‌యంలోనే త‌న గ్యాంగ్‌లోకి వ‌చ్చిన తిరు పేరుతో వ‌చ్చిన ప‌ల‌నిని బాగా న‌మ్ముతాడు. అత‌ను ఏది చెబితే అది చెయ్య‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు. మ‌రోప‌క్క కార్తికేయ‌న్‌ని, దుబాయ్‌లో ఉండే అబ్దుల్ హ‌మీద్‌ను స్మ‌గ్లింగ్ నేరంపై ప‌క‌డ్బందీగా ప‌ట్టుకునేందుకు నిత్యారెడ్డి, ప‌ళ‌ని ప్లాన్ చేస్తుంటారు. కార్తికేయ‌న్ మంచిత‌నం వ‌ల్ల అత‌నిపై ప‌ళ‌నికి సాఫ్ట్ కార్న‌ర్ ఏర్ప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఆప‌రేష‌న్ మోల్‌లో ఎలాంటి ప‌రిణామాలు జ‌రిగాయి?  నిత్యారెడ్డి, ప‌ళ‌ని స్మ‌గ్ల‌ర్స్ గ్యాంగ్‌ను ప‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారా? ఈ ఆప‌రేష‌న్‌లో వారి మాన‌సిక సంఘ‌ర్ష‌ణ ఏమిటి?  వారికి ఎలాంటి న‌ష్టం జ‌రిగింది?  చివ‌రికి ఏం జ‌రిగింది? అనే విష‌యాల గురించి ఈ స‌మీక్ష‌లో తెలుసుకుందాం.

విశ్లేష‌ణ:

ఒక పోలీస్ ఆఫీస‌ర్ అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌లో భాగంగా విల‌న్స్ గ్యాంగ్‌లోనే చేర‌డం ఆ త‌ర్వాత వారిని చ‌ట్టానికి అప్ప‌గించ‌డం వంటి క‌థాంశాల‌తో గ‌తంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన పుష్ప‌, అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చిన పోకిరి, ధురంధ‌ర్ చిత్రాలు ఓం చూస్తున్న‌ప్పుడు గుర్తొస్తాయి. య‌దార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా క‌థ రూపొంద‌డం, దాన్ని ఆడియ‌న్స్‌కి క‌నెక్ట్ అయ్యేలా తెర‌కెక్కించ‌డం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్ అన‌గానే క‌థ‌లో ఏం జ‌రగ‌బోతోంది అనే విష‌యం ముందుగానే ప్రేక్ష‌కులు ప‌సిగ‌ట్టే అవ‌కాశం ఉంటుంది. ఇందులో కూడా అదే జ‌రిగింది. అయితే స‌న్నివేశాలను రూపొందించిన విధానం, క్యారెక్ట‌రైజేష‌న్‌, కొన్ని ఎమోష‌న్స్ సినిమాను నెక్స్‌ట్ లెవ‌ల్ తీసుకెళ్లాయ‌ని చెప్పొచ్చు. దానికి త‌గ్గ‌ట్టుగానే న‌టీన‌టుల పెర్‌ఫార్మెన్స్ ఆ పాత్ర‌ల‌కు వ‌న్నె తీసుకొచ్చాయి. డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ క్యారెక్ట‌ర్ల‌ను బిల్డ‌ప్ చేసిన‌ విధానం, స్క్రీన్‌ప్లే, టేకింగ్ సినిమా ప్ల‌స్ పాయింట్స్‌గా నిలిచాయి. 20 మంది కూలీల‌ను ఎన్‌కౌంటర్ చేసే సీన్‌ను ఆడియ‌న్స్‌లో ఉత్కంఠ రేపే విధంగా చిత్రీక‌రించారు. పోలీస్ ఆప‌రేష‌న్‌, స్మ‌గ్లింగ్ మాత్ర‌మే కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్స్‌, తండ్రీకొడుకుల మ‌ధ్య, తాత‌, మ‌న‌వ‌డు మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని చ‌క్క‌గా చూపించారు. స్మ‌గ్లింగ్ యాక్టివిటీ, ఫారెస్ట్‌లో పోలీసుల ఆప‌రేష‌న్ వంటి స‌న్నివేశాల‌ను ఇంట్రెస్టింగ్‌గా తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ఉన్న మైన‌స్ పాయింట్స్ ఏమిటంటే.. కొన్ని చోట్ల స్లో నేరేష‌న్ ఉండ‌డం, క్లైమాక్స్‌లో వ‌చ్చే పోలీసులు, ఖైదీల మ‌ధ్య ఫైట్ లెంగ్త్ ఎక్కువగా ఉండ‌డం ఆడియ‌న్స్‌కి బోర్ కొట్టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఓవ‌రాల్‌గా అమ‌ర‌న్ త‌ర్వాత రాజ్‌కుమార్ పెరియ‌సామి చేసిన మ‌రో మంచి ప్ర‌య‌త్నంగా ఈ సినిమాను చెప్పొచ్చు. సినిమా అంటే ర‌క్త‌పాతం ఉండాల్సిందే అన్న‌ట్టుగా ఈ మ‌ధ్య వ‌చ్చే సినిమాల్లో మితిమీరిన హింస ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో గ‌న్‌ల‌కే ప‌నిచెప్పారు త‌ప్ప క‌త్తులు, క‌టార్లు వాడిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌.  

న‌టీన‌టులు:

ఈ సినిమాలోని ప్ర‌తి పాత్ర‌కు ఆయా న‌టీన‌టులు పూర్తి న్యాయం చేశారు. మొద‌ట చెప్పుకోవాల్సింది ధ‌నుష్‌, మ‌మ్ముట్టి, సాయిప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ల గురించి. ధ‌నుష్ ఎప్ప‌టిలాగే త‌న పాత్ర‌ను ప్రాణం పెట్టి చేశాడు. యాక్ష‌న్ సీన్స్‌లో, ఎమోష‌న‌ల్ సీన్స్‌లో హండ్రెడ్ ప‌ర్సెంట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక మ‌మ్ముట్టి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌న క్యారెక్ట‌ర్‌ను ఎంతో హుందాగా చేశారు. ఆయ‌న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా గుడ్ కాదు, బ్యాడ్ కాదు అనేలా కార్తికేయ‌న్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశారు డైరెక్ట‌ర్‌. ఎఎస్‌పి నిత్యారెడ్డి క్యారెక్ట‌ర్‌లో సాయిప‌ల్ల‌వి ఎంతో డిగ్నిఫైడ్‌గా క‌నిపించింది. సినిమా అంతా దాన్నే మెయిన్‌టెయిన్ చేస్తూ త‌న పెర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకుంది. గ్లామ‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ‌లీల ఈ సినిమా ఒక బాబుకి త‌ల్లిగా ఒదిగిపోయింద‌ని చెప్పాలి. ఒక హీరోయిన్‌లా కాకుండా ఒక త‌ల్లిగా మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శిం చింది. ప‌ళ‌ని తండ్రిగా న‌టించిన ఇంద్ర‌న్స్ త‌న నేచుర‌ల్ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎమోష‌న‌లైజ్ చేశారు. ఇక రేణు దేశాయ్ ఈ సినిమాలో ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మెరిశారు. కార్తికేయ‌న్ భార్య అమ‌ల‌గా ఆమె ప్ర‌త్యేకంగానే క‌నిపించారు. అబ్దుల్ హ‌మీద్ పాత్ర‌లో న‌సీరుద్దీన్ షా త‌న‌దైన శైలిలో మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. 

సాంకేతిక నిపుణులు:

ఎళిల్ అరసు సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి హైలైట్ అనిపించేలా ఉంది. డే ఎఫెక్ట్ అయినా, నైట్ ఎఫెక్ట్ అయినా ఎంతో బాగా పిక్చ‌రైజ్ చేశారు. కళైవాణన్ ఎడిటింగ్ కూడా బాగుంది. అయితే దాదాపు మూడు గంట‌లు ఉన్న ఈ సినిమాలో క‌నీసం 20 నిమిషాలు త‌గ్గించే ఛాన్స్ ఉంద‌ని చూసిన వారంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. ఎందుకంటే కొన్ని సీన్స్ ఎక్కుల లెంగ్త్ ఉండ‌డ‌మే దానికి కార‌ణం. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్ ఎక్కువ సాగ‌దీశార‌నే అభిప్రాయం ఆడియ‌న్స్‌కి క‌లుగుతుంది. ఇక సంగీతం విష‌యానికి వ‌స్తే.. సాయి అభ్యంక‌ర్ త‌న సంగీతంతో సినిమాను న‌డిపించాడ‌ని చెప్పాలి. రెగ్యుల‌ర్ సినిమాల్లో ఉన్న‌ట్టుగా ఇందులో డూయెట్లు, స్పెష‌ల్ సాంగ్స్ లేవు. సిట్యుయేష‌న్‌కి త‌గ్గ‌ట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌లో వ‌చ్చే పాట‌లే త‌ప్ప ప్ర‌త్యేకంగా పాట‌ల కోసం ఎలాంటి సెట‌ప్ లేదు. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశాడు. ప్రొడ‌క్ష‌న్స్ వేల్యూస్ బాగున్నాయి. అవ‌స‌ర‌మైన మేర‌కు రాజీ ప‌డ‌కుండా చిత్రాన్ని నిర్మించారు. 

ప్ల‌స్ పాయింట్స్:

న‌టీన‌టుల పెర్‌ఫార్మెన్స్‌
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
ఫోటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్:

స్లో నేరేష‌న్‌
సినిమా లెంగ్త్‌
సెకండాఫ్‌

ఫైన‌ల్‌గా చెప్పాలంటే..
య‌దార్థ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సాగే ఈ సినిమా కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే అవ‌కాశం ఉంది. ధ‌నుష్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియ‌న్స్ ఈ సినిమాను ఒక‌సారి చూడొచ్చు. 

రేటింగ్: 2.5/5
 

- జి.హ‌రా

 

 

 

[OMMovieReview, Dhanush, Mammootty, Sai Pallavi, Sreeleela] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com