'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అంటున్న చిరు, బాలయ్య!
on Feb 27, 2023
సీనియర్ హీరోల ఓల్డ్ హిట్ సాంగ్స్ ని యువ హీరోలు తమ సినిమాల్లో రీమిక్స్ చేయడం సహజం. అయితే ఈసారి రొటీన్ కి భిన్నంగా తమ పాటలను తామే రీమిక్స్ చేసుకుంటాం అంటున్నారు ఇద్దరు సీనియర్ హీరోలు. ఆ సీనియర్ హీరోలు ఎవరో కాదు.. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు నటసింహం నందమూరి బాలకృష్ణ.
ఇటీవల 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నారు. ఇది తమిళ మూవీ 'వేదాళం'కి రీమేక్ అయినప్పటికీ మెగా అభిమానులు మెచ్చేలా ఎన్నో మార్పులు చేస్తున్నారు. ఇందులో తన సొదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి కనిపించనున్నారని టాక్. అంతేకాదు ఈ మూవీలో 'రామ్మా చిలకమ్మా' సాంగ్ రీమిక్స్ చేస్తున్నారని న్యూస్ వినిపిస్తోంది. 25 ఏళ్ళ క్రితం చిరంజీవి నటించిన 'చూడాలని వుంది' చిత్రంలోని 'రామ్మా చిలకమ్మా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సాంగ్ రీమిక్స్ తో మెగాస్టార్ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ మీద కన్నేసిన బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. తన మొదటి చిత్రం 'పటాస్'లో బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ 'అరె ఓ సాంబ'ని రీమిక్స్ చేసిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు బాలకృష్ణతో చేస్తున్న చిత్రంలోనూ ఆయన మరో సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 24 ఏళ్ల క్రితం బాలకృష్ణ నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'సమరసింహారెడ్డి'లోని 'అందాల ఆడబొమ్మ' పాటను 'NBK 108'లో రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం.
'రామ్మా చిలకమ్మా', 'అందాల ఆడబొమ్మ' ఈ రెండు పాటలకూ మణిశర్మనే సంగీతం అందించడం విశేషం. ఇప్పుడు 'భోళా శంకర్'కి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, 'NBK 108'కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ రీమిక్స్ పాటలు మణిశర్మ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాయేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
