జపాన్ టూర్‌లో లేడీ ఫ్యాన్ ఇచ్చిన ట్విస్ట్‌కి షాక్ అయిన ఎన్టీఆర్!
on Mar 27, 2025
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘దేవర’ గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 300 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్‌చరణ్ సోలో హీరోగా చేసిన ‘గేమ్‌ఛేంజర్’ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మాత్రం సోలో హీరోగా ‘దేవర’తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. గతంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం జపాన్‌లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొని ‘దేవర’ చిత్రాన్ని కూడా అక్కడ రిలీజ్ చేస్తున్నారు. మార్చి 28న ఈ సినిమా జపాన్‌లో సందడి చేయబోతోంది. దీన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఆ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి అభిమానుల్ని కలుసుకునే క్రమంలో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యే సంఘటన జరిగింది.
జపాన్‌లోని అభిమానులు ఎన్టీఆర్‌ను చూసి చుట్టుముట్టారు. అందరూ లేడీ ఫ్యాన్సే కావడం విశేషం. అందరూ ఆటోగ్రాఫ్స్ తీసుకుంటున్న సమయంలో ఒక అమ్మాయి ‘అన్నా.. నేను ఆర్‌ఆర్‌ఆర్ చూసి తెలుగు నేర్చుకున్నాను. రెండు సంవత్సరాల క్రితం ఇది నేను రాసుకున్నాను. మీరు నాకు బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్’ అంటూ తను తెలుగు ప్రాక్టీస్ చేసిన బుక్ చూపించింది. అది చూసి ఎన్టీఆర్ షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని ‘వావ్.. మీరే అందరికీ గొప్ప ఇన్‌స్పిరేషన్’ అంటూ ఆ బుక్‌లో తన ఆటోగ్రాఫ్ పెట్టి ఆమెను అభినందించారు.
ఆ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. ‘నేను జపాన్ సందర్శించినప్పుడల్లా నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలను ఇస్తుంది. కానీ, ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఒక జపనీస్ అభిమాని ఆర్‌ఆర్‌ఆర్ చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నిజంగా నన్ను కదిలించింది. సినిమా, భాషలను ప్రేమించే వ్యక్తిగా నేనెంతో సంతోషిస్తున్నాను. సినిమా అనేది సంస్కృతుల మధ్య వారధిగా ఉండడం, ఆ సినిమా శక్తి ఒక అభిమానిని ఒక భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తం అవుతోందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ’ అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
