'వరల్డ్ ఫేమస్ లవర్'కు బజ్ ఏదీ?
on Dec 5, 2019
విజయ్ దేవరకొండ మునుపటి సినిమా 'డియర్ కామ్రేడ్' సరిగా ఆడకపోయినా యూత్‌లో అతని క్రేజేమీ పడిపోలేదు. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ అతనికి ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో అతనిని ట్రెండ్‌సెట్టర్‌గా పరిగణించారు కూడా. అలియా భట్ అంతటి పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ సైతం తనకు విజయ్ స్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పిందంటే మనవాడి పాపులారిటీ దేశవ్యాప్తంగా ఎలా ఉందో ఊహించుకోవాల్సిందే. అయితే విచిత్రంగా అతని లేటెస్ట్ ఫిల్మ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీపై బజ్ కనిపించడం లేదు! క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ ఏకంగా నలుగురు భామలతో రొమాన్స్ చేస్తున్నప్పటికీ, ఎందుకనో ఆ పాయింట్ కూడా సినిమాపై ఊహించినంత క్రేజ్ తీసుకు రావడం లేదు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, 'మిస్టర్ మజ్ను' ఫేం ఇసాబెల్లే లీటే లతో ఈ మూవీలో అతను ప్రేమలో పడతాడు. ఈ నలుగురిలో ఎవరికి అతను దక్కుతాడనేది ఇంట్రెస్టింగ్.
అదివరకు యూత్‌లోనే క్రేజ్ ఉన్న విజయ్‌ను 'గీత గోవిందం' సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ దగ్గర చేసింది. 2018 ఆగస్టులో వచ్చిన ఆ మూవీ తర్వాత విజయ్ పాపులారిటీ నాలుగింతలు పెరిగింది. అయితే, దానికి తగ్గట్లుగా పెరిగిన అంచనాలను అతని తర్వాతి సినిమాలు అందుకోలేకపోయాయి. 'నోటా' సినిమా ఫ్లాపవగా, 'టాక్సీవాలా' హిట్ అనిపించుకుంది కానీ, దానికి వచ్చిన కలెక్షన్లు కానీ, ఆ మూవీలో విజయ్ క్యారెక్టర్ కానీ అతని ఇమేజ్‌కు తగ్గట్లు లేవనేది నిజం. ఇక 'గీత గోవిందం' హీరోయిన్ రష్మికా మందన్నతో కలిసి అతను నటించిన 'డియర్ కామ్రేడ్' మూవీకి వచ్చిన బజ్ చూస్తే, విజయ్ కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందేమో అనిపించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజైన ఆ మూవీ అంచనాలను అందుకోలేక చతికిలపడింది.
ఈ నేపథ్యంలో విజయ్‌పై ఒత్తిడి పెరిగింది. నెక్స్ట్ వచ్చే సినిమా పెద్ద హిట్టవ్వకపోతే.. అతనికి వచ్చిన క్రేజ్ అంతా గాలివాటమనే విమర్శలకు బలం చేకూరుతుంది. అందుకు తగ్గట్లే విశ్లేషకులు, విమర్శకులు 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 14న 'ప్రేమికుల రోజు' సందర్భంగా ఆ సినిమా విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినా, ఇంతదాకా దానిపై బజ్ స్టార్ట్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దానికి తగ్గట్లే ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్న ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ శ్రీనివాసరావు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని చదలవాడ 24 కోట్ల రూపాయలకు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ హక్కుల్ని కొనుగోలు చెయ్యడానికి ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అడ్వాన్స్ కింద 4 కోట్ల రూపాయలను కూడా ఆయన చెల్లించినట్లు సమాచారం. అయితే ఆంధ్ర, రాయలసీమ ఏరియాల నుంచి ఈ మూవీని కొనేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపించకపోవడంతో ఆయన పునరాలోచనలో పడ్డారనీ, అందుకే పూర్తిగా చేతులు కాలక ముందే బయటపడటం మంచిదనుకొని తను ఆ సినిమాని రిలీజ్ చెయ్యలేనని చిత్ర నిర్మాత కె.ఎస్. రామారావుకు చెప్పేసినట్లు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
దీన్ని బట్టి 'వరల్డ్ ఫేమస్ లవర్'కు మార్కెట్‌లో క్రేజ్ రాలేదని తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ క్రాంతిమాధవ్ ట్రాక్ రికార్డ్ కూడా దీనికి దోహదం చేస్తున్నదనే మాట వినిపిస్తోంది. నిజానికి క్రాంతిమాధవ్‌కు సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరుంది. ఆయన ఇదివరకు 'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఉంగరాల రాంబాబు' సినిమాలను డైరెక్ట్ చేశాడు. వీటిలో ఏ ఒక్కటీ సూపర్ హిట్ కాలేదు. 'ఓనమాలు' సినిమాలో అనుబంధాలను బాగా చూపాడనే పేరు తెచ్చుకున్నాడు. శర్వానంద్, నిత్యా మీనన్ నటించిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాను రూపొందించిన తీరుతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా విమర్శకుల మెప్పు పొందాడు. సునీల్ హీరోగా తీసిన 'ఉంగరాల రాంబాబు' మూవీ ఆయనకు కానీ, సునీల్‌కు కానీ పేరు తీసుకురాలేదు. ఇలాంటి బ్యాకింగ్‌తో ఆయన విజయ్‌ను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ 'అర్జున్‌రెడ్డి' లుక్‌ను తలపించిన విషయం మనకు తెలుసు. ఇది చాలామందిని డిజప్పాయింట్ చేసింది. విజయ్ నుంచి అతని ఫ్యాన్స్ చాలా ఆశిస్తున్నారు. అతడిని కొత్తగా చూడాలని వాళ్లు కోరుకుంటున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్లు 'వరల్డ్ ఫేమస్ లవర్' ఉంటాడా? లెటజ్ వెయిట్ అండ్ సీ...

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
