రివ్యూ: నేల టికెట్టు
on May 25, 2018
సినిమాలు రెండు రకాలు
మంచి సినిమా
చెత్త సినిమా
మంచి సినిమాలోనూ లోపాలుంటాయి.. చెత్త సినిమాలోనూ ఒకటో రెండో మంచి విషయాలుంటాయి. కానీ.. `ప్లస్ పాయింట్స్` భూతద్దంలో వెదికినా కనిపించని సినిమాలు అరుదగా వస్తుంటాయి. `నేల టికెట్టు` ఆ టైపే.
ఈ సినిమాలో కథ ఉంది..కానీ విషయం లేదు.
నటీనటులు ఉన్నారు కానీ.. వాళ్లలో హుషారు లేదు.
పాటలున్నాయి.. కిక్కు లేదు.
ఫైట్లున్నాయి కానీ ఉత్సాహం లేదు.
అసలు ఇలాంటి కథ ఎంచుకున్నందుకు అటు హీరోకి, ఇటు నిర్మాతకీ కామన్‌సెన్స్ లేదు.
* కథ
రవితేజని నేల టికెట్టు అనిపిలుస్తుంటారు. చిన్నప్పడు పెరిగింది థియేటర్లో కాబట్టి, ఆ పేరొచ్చింది. చుట్టూ జనం - మధ్యలో మనం అనుకునే రకం. వరస పెట్టి పిలిస్తే చాలు.. వాళ్ల కోసం ఏమైనా చేసేస్తాడు. ఓ పనిమీద హైదరాబాద్ వచ్చి హోం మినిస్టర్ (జగపతిబాబు) మనుషులతో పెట్టుకుంటాడు. అక్కడి నుంచి హోం మినిస్టర్‌కీ, నేల టికెట్టుకీ మధ్య వార్ మొదలవుతుంది. ఈ పోరులో ఎవరు గెలిచారు? అసలు హోం మినిస్టర్‌కీ, నేల టికెట్టుకీ మధ్య ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
* విశ్లేషణ
`నేల టికెట్టు` అనే పేరు బాగుంది కదా, దీనిపై ఓ సినిమా తీసేద్దాం - అని రవితేజ, కల్యాణ్ కృష్ణ ఫిక్సయిపోయి రంగంలోకి దిగిపోయి ఉంటారు. అందుకే ఇలాంటి కళాఖండం బయటకు వచ్చింది. అసలు ఈ సినిమాలో కథ ఉందా, ఉన్నా దర్శకుడు పట్టించుకున్నాడా? అనే డౌటు వస్తుంది. తలా తోకా లేని సన్నివేశాలు చాలా వచ్చిపోతుంటాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వదు. లెక్కకు మించిన ఫ్లాష్ బ్యాక్‌లు సినిమాని సాగదీస్తూనే ఉంటాయి. ఇంట్రవెల్ వరకూ అసలు కథేంటి? ఇలా ఎందుకు నడుస్తోంది? అనేది అర్థం కాదు. ఇంట్రవెల్ తరవాత... కథ అర్థమైనా ప్రయోజనం ఉండదు. అప్పటికే మనలోని రసం పీల్చేశాడు దర్శకుడు. హీరో - విలన్ మధ్య వార్ లో ఇంటిలిజెన్సీ ఏం ఉపయోగించలేదు. ఓ హోం మినిస్టర్‌ని ఓ సామాన్యుడు ఎదిరించడం అంటే మాటలు కాదు. ఆ సన్నివేశాల్లో ఎంత ఫైర్ ఉండాలి? అలాంటిది లాజిక్కులు లేకుండా, అల్లాటప్పాగా తీసేశాడు దర్శకుడు. వీటికి తోడు రకరకాల సమస్యలు కథలో ఇరికించేశాడు. అవి కేవలం సినిమాని సాగదీయడానికి తప్ప ఎందుకూ పనికి రాలేదు. ఏ సన్నివేశం ఎందుకు వస్తోందో, ఏది ముందో.. ఏది వెనుకో ఏమీ అర్థం కాదు. స్క్రీన్ ప్లే ఆ రేంజులో ఉంది. కథలో ఒక్క ఎమోషన్‌కీ ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోతే.. తెరపై ఎంతమంది సూపర్ స్టార్లు కనిపించినా లాభం ఉండదు. క్లైమాక్స్ మరీ దారుణంగా, నీరసంగా ఉంటుంది. జగపతిబాబు మారిపోవడం కూడా అత్యంత కృతకంగా ఉంది. సినిమానే అలా ఉన్నప్పుడు క్లైమాక్స్ అలా ఉంటే తప్పేముంది??
* నటీనటులు
రవితేజ సోలో హ్యాండ్‌తో లాగించేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ కథకు రవితేజ బలం కూడా సరిపోలేదు. అతని క్యారెక్టర్ తో మ్యాజిక్ చేద్దామనుకున్న దర్శకుడికి నిరాశే ఎదురైంది. మాళవిక శర్మ బాగానే ఉన్నా, ఆ పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం చాలా తక్కువ. రవితేజతో కెమిస్ట్రీ కూడా సరిగా పండలేదు. జగపతిబాబుని కూడా దర్శకుడు సరిగా వాడుకోలేదు. ఆ పాత్ర ఒక్కటే కాదు. అన్ని పాత్రలూ అలానే తయారయ్యాయి. ఒక్క పాత్రకీ సరైన ఎంట్రీ, ఎగ్జిట్ ఉండదు. ఎలా పడితే అలా రాసుకున్నాడు.
* సాంకేతిక వర్గం
కథకుడిగా, దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. దర్శకుడు దారి తప్పితే.. మిగిలిన సాంకేతిక నిపుణుల పరిస్థితి వేరేగా చెప్పేదేముంది? పాటలు ఘోరంగా ఉన్నాయి. ఎడిటింగ్ ప్రాధమిక సూత్రాలు కూడా ఎడిటర్ మర్చిపోయాడు. సాంకేతికంగానూ ఈ సినిమా గొప్పగా లేదు. సినిమా చూట్టేసిన ఫీలింగ్ కలిగితే.. అది ప్రేక్షకుడి తప్పు కాదు.
* ప్లస్ పాయింట్స్
ఆ ఒక్కటీ అడక్కండి
* మైనస్ పాయింట్స్
ఒక్కటని ఏం చెబుతాం?
* ఫైనల్ పంచ్: నేల నాకించేశాడు...!
రేటింగ్: 1