స్కూలు రోజుల్లో నరేశ్‌ను ఆయనకంటే పెద్దమ్మాయి లవ్ చేసింది!
on May 18, 2021
హీరోయిన్ లేదా హీరో తండ్రి క్యారెక్టర్ అంటే డైరెక్టర్లకు మొదటగా గుర్తొస్తున్న పేరు సీనియర్ నరేశ్. ఇవాళ ఆయన ఫాదర్ క్యారెక్టర్‌కు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిపోయారు. ఏ సినిమా చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఒకప్పుడు కామెడీ హీరోగా ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరింత బిజీ అయిపోయారు. లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల డైరెక్ట్ చేసిన 'నాలుగు స్తంభాలాట' సినిమాతో నరేశ్ హీరోగా పరిచయమయ్యారు. నిజానికి ఆయనను డాక్టర్ చెయ్యాలని తల్లి విజయనిర్మల భావించారు. కానీ చిన్నప్పట్నుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వల్ల నటన మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఆర్టిస్ట్‌గా మారారు నరేశ్.
ఆయన చిన్నతనంలో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది. స్కూల్లో చదువుకొనేటప్పుడు ఆయనకంటే వయసులో నాలుగేళ్లు పెద్దయిన ఓ అమ్మాయి అతడిని ప్రేమించింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంగా వెల్లడించారు నరేశ్. ఆయన చెన్నై ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూల్లో చదువుకున్నారు. "అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా. ఒక అమ్మాయి ఎస్.ఎస్.ఎల్.సి. చదువతోంది. మేమిద్దరం ఒకే మాస్టారు దగ్గర ప్రైవేట్ చదివేవాళ్లం. ఒకసారి ఆ అమ్మాయి నా చేయిపట్టుకొని వాచీని ముద్దు పెట్టుకుంది. 'చాలా బావుంది' అంది. అప్పుడు నేనంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మరోసారి ప్రైవేట్ జరుగుతూ ఉండగా మా మేస్టారు కాఫీ కోసం హోటల్‌కు వెళ్లారు. ఆయన అటు వెళ్లగానే ఆ అమ్మాయి ఓ కాయితం చేతిలో పెట్టి 'ఐ లవ్ యూ..' అంది. అంతే నా గుండె దడదడలాడింది." అని ఆయన గుర్తు చేసుకున్నారు.
అంతకుముందు ఆ అమ్మాయి పద్యాలు, అవీ రాసి పంపేది కానీ ఆ రోజు ఆ అమ్మాయి అలా చెప్పడంతో తాను హోటల్ దగ్గరున్న మేస్టారు దగ్గరకు వెళ్లిపోయానని నరేశ్ చెప్పారు. "ఆయన నన్నుచూసి 'ఏరా?' అన్నారు. 'లెక్కలు అర్థం కావటం లేదు' అన్నాను. 'సరే కాఫీ తాగు' అన్నారు. కాఫీ తాగి ఆయనతో తిరిగివచ్చాను. ఇక ఆ అమ్మాయి మొహంలో భయం. 'చెప్పేశావా?' అనడుగుతోంది. చెప్పలేదు అన్నట్లు సైగచేసి చెప్పాను. ఆ మరునాడు నన్ను పిలిచి 'ఛీ ఛీ చిన్నపిల్లల్ని ఎప్పుడూ ప్రేమించకూడదు' అని ఎడాపెడా చీవాట్లు పెట్టింది." అని తెలిపారు నరేశ్. ఆ అమ్మాయి తమిళమ్మాయి అనీ, ఆ తర్వాత చాలా కాలం తాము ఫ్రెండ్స్‌లా ఉంటూవచ్చామనీ వెల్లడించారు నరేశ్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
