బాలయ్య ఫ్యాన్స్‌కి షాకిచ్చిన పూరి
on Feb 28, 2017
నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్... అసలే ఇది షాకింగ్ కాంబినేషన్. అందుకు తగ్గట్టుగా షాకుల మీద షాకులు ఇస్తున్నాడు పూరి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లుంటారని, ఇది బాలయ్యలోని రొమాంటిక్ యాంగిల్ టచ్ చేసే చిత్రమని చెప్పి తొలి షాక్ ఇచ్చాడు పూరి. ఇప్పుడు అన్నింటికంటే పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను కొత్తవాళ్లనే ఎంచుకోబోతున్నాడు. అందుకోసం ఆడిషన్స్ కూడా నిర్వహించనున్నాడు పూరి. ఓ కథానాయికగా తమన్నా ఫిక్సయ్యిందని, మిగిలిన రెండు పాత్రలూ స్టార్ హీరోయిన్లకే దక్కుతాయని భావించిన బాలయ్య ఫ్యాన్స్‌కి పూరి గట్టి షాకే ఇచ్చాడు.
హీరోయిన్లే కాదు.. మొత్తమ్మీద 12 మంది నటీనటులను కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేస్తున్నాడు పూరి. విలన్, కమిడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా అందరినీ కొత్తవాళ్లనే తీసుకొంటున్నాడు. బాలయ్య లాంటి స్టార్ హీరో పక్కన స్టార్ హీరోయిన్లు, స్టార్ ఆర్టిస్టులు ఉంటే ప్యాడింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, సినిమాకి లుక్ వస్తుంది. కానీ.. అందర్నీ కొత్తవాళ్లనే తీసుకొంటే... ఇదో ప్రయోగమే అనుకోవాలి.
ఓ స్టార్ హీరో సినిమాకి ముగ్గురు హీరోయిన్లను ఇలా కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేసుకోవడం నిజంగానే అరుదైన విషయం. సాధారణంగా కాస్టింగ్ కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకొన్న నటీనటులకు ముందస్తు తర్పీదు ఇవ్వడం కామన్. ఆ లెక్కన.. పూరికి కావల్సిన నటీనటులు ఎప్పుడు దొరుకుతారు? వాళ్లందరికీ ఎప్పుడు శిక్షణ ఇస్తాడు? చూస్తుంటే చెప్పిన టైమ్‌కి ఈ సినిమాని విడుదల చేయడం... కష్టమే అనిపిస్తోంది. చూద్దాం.. పూరి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో??