ఆ విషయంలో బాలయ్యని దాటేసిన చిరు!
on Oct 25, 2016
చిరంజీవి 150వ సినిమా ఖైది నెం.150, బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి దాదాపు ఒకేసారి షూటింగ్ మొదలెట్టాయి. రెండు సినిమాలకూ ఒకేసారి బిజినెస్ మొదలైంది. ఇప్పుడు రెండు సినిమాలూ ఒకేసారి సంక్రాంతికి రాబోతున్నాయి. దాంతో ఆటోమెటిగ్గానే రెండు సినిమాల మధ్య పోటీ పెరిగింది.. అభిమానులు పోలికలు వెతికేస్తున్నారు. ఏ సినిమాకి ఎంత మార్కెట్ జరిగింది? ఎవరిని ఎవరు బీట్ చేయబోతున్నారు? ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ వసూలు చేస్తుంది? అనే లెక్కలు మొదలైపోయాయి.
దాంతో తెలియకుండానే బాలయ్య వర్సెస్ చిరంజీవి అంటూ... ఈ రెండు సినిమాలు ఢీ కొట్టుకోవడానికి సిద్ధమైపోయాయి. ఇమేజ్ పరంగా, అభిమాన గణం పరంగా బాలయ్య, చిరులు దాదాపు ఒకే రేంజులో ఉన్నారు. అయితే రెండు సినిమాలతో పోలిస్తే చిరు సినిమాకే ఎక్కువ మార్కెట్ జరిగింది. బాలయ్యకు రూ.60 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే... చిరు విషయానికొచ్చే సరికి అది ఏకంగా రూ.85 కోట్ల వరకూ ఉంది.
శాటిలైట్ విషయంలోనూ చిరు బాలయ్యని దాటేశాడు. గౌతమి పుత్ర శాతకర్ణిని మాటీవీ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఖైదీ నెం.150 ని మాత్రం ఏకంగా రూ.14 కోట్లకు అడుగుతోందని టాక్. ఆ లెక్కన శాటిలైట్ విషయంలో బాలయ్యపై చిరుదే పైచేయి అన్నమాట. మరి బాక్సాఫీసు దగ్గర ఈ రెండు సినిమాల్లో ఏది గెలుస్తుందో, దేన్ని సంక్రాంతి విజేతగా నిలబెడతారో చూడాలి.