బాలకృష్ణా.. నోరు కంట్రోల్‌లో పెట్టుకో: నాగబాబు వార్నింగ్
on May 28, 2020
"టాలీవుడ్ పెద్దలు భూములు పంచుకోవడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారా?" అంటూ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చిరంజీవిగారింట్లో నాగార్జున, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, అల్లు అరవింద్, సురేశ్‌బాబు, చిల్లర కల్యాణ్ వంటి కొంత మంది సమావేశమై షూటింగ్‌లు ఎలా ప్రారంభించాలనే విషయమై మాట్లాడుకున్నారని నాగబాబు చెప్పారు. "ఇవాళ బాలకృష్ణ ఓ న్యూస్‌క్లిప్‌లో మాట్లాడిన మాటలు చూశాను. ఆయనను మీటింగ్‌కు పిలవకపోవడం తప్పా, ఒప్పా అనే విషయం నాకు తెలీదు. ఆ మీటింగ్‌ను ఆర్గనైజ్ చేసిన వాళ్లను ఈ విషయం అడగాల్సిన బాధ్యత బాలకృష్ణదే. తనను పిలవనందుకు ఆయన కోపపడటం వరకు బాగానే ఉంది. కానీ ఆయన నోరుజారి.. భూములు పంచుకుంటున్నారు, అందుకే కలిశారు అనడం చూశాను. అది చూసి ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా, నటుడిగా నాకు చాలా బాధ కలిగింది" అని ఆయన అన్నారు.
అర్జంట్‌గా బాలకృష్ణ తన మాట వెనక్కి తీసుకోవాలి అని నాగబాబు డిమాండ్ చేశారు. "నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం కరెక్ట్ కాదు, అంతకంటే పది రెట్లు ఎక్కవ మాట్లాడ్డానికి ఇక్కడ పది మంది రెడీగా ఉన్నారు. కొంచెం నోరు కంట్రోల్ చేసుకొని బాలకృష్ణగారు మాట్లాడాలి. ఇండస్ట్రీ బాగు కోసం వెళ్లారు కానీ, భూములు పంచుకోడానికి ఇక్కడెవరూ వెళ్లలేదు. ఇండస్ట్రీపై ఇదా మీకున్న రెస్పెక్ట్? చాలా చాలా తప్పు మాట్లాడారు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా తెలంగాణ గవర్నమెంట్‌ను కూడా అవమానపరిచారు. తెలంగాణ గవర్నమెంట్ భూములు పందేరం చేయడానికి మీటింగ్‌కు పిలిచిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పి, ఆ తర్వాత ఏమైనా చెయ్యండి. అది మీ బాధ్యత. ఇక్కడెవరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యట్లేదు. మీరేం మాట్లాడినా నోరు మూసుకొని కూర్చోడానికి ఇక్కడెవరూ లేరు. ఇండస్ట్రీకి మీరేమీ కింగ్ కాదు. మీరొక హీరో మాత్రమే. కంట్రోల్‌గా మాట్లాడడం నేర్చుకోండి బాలకృష్ణగారూ" అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.
అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లే మాట్లాడతారని అన్నారు. ఎవరు పడితే వాళ్లు వ్యక్తిగతంగా మాట్లాడితే తాను స్పందించడం కరెక్ట్ కాదేమోనని ఆయనన్నారు. బాలకృష్ణ మాట్లాడిన విజువల్స్ ఇప్పటివి కావనీ, ఎప్పటివో అనీ కొంతమంది అంటున్నారని ఆయన చెప్పారు. వాటిపై క్లారిటీ వచ్చాక తాను మాట్లాడతానన్నారు. కేసీఆర్ గారిని కలవడానికి తాము ఇండస్ట్రీనంతా పిలవలేదనీ, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఎగ్జిబిటర్లకు సంబంధించిన అంశం కాబట్టి అసోసియేషన్ల వారిని పిలిచామన్నారు. పిలవాలంటే ఇంకా చాలామంది ఉన్నారనీ, ఇండస్ట్రీనంతా పిలిచి మీటింగ్ పెడదామంటే తనకేమీ అభ్యంతరం లేదని తలసాని తెలిపారు.
ఈ వివాదానికి కారణం.. ‘‘నన్ను ఎవరూ పిలవలేదు. ఎవరు పిలిచారు నన్ను? అన్ని మీటింగులు జరిగాయి. నన్ను పిలిచారా? వీళ్లందరూ హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా...? శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని?? నన్ను ఒక్కడు పిలవలేదు. మళ్లీ ఎప్పుడు షూటింగులు స్టార్ట్ అవుతాయని మీటింగులు జరిగాయి. నన్ను ఒక్క మీటింగ్‌కి పిలవలేదు. భూములు పంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? ఇది వాస్తవం. ఏంటి వక్రీకరించేది?’’ అని తనతో ఉన్న వైద్యులతో బాలకృష్ణ అన్న ఒక వీడియో క్లిప్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
