నాగబాబు దృష్టిలో గాడ్సే నిజమైన దేశభక్తుడు.. మరి గాంధీ?
on May 19, 2020
నాగబాబుకు ఉన్నట్లుండి ఏమైంది? లైమ్‌లైట్‌లో ఉండటం కోసం ఏవో కాంట్రవర్సీ మాటలు మాట్లాడే వాళ్ల జాబితాలో ఆయన కూడా చేరాడా? ఆయన వరుస చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మహాత్మా గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సేని నిజమైన దేశభక్తుడని పొగిడిన నాగబాబు, ఆపైన గాంధీని గాడ్సే చంపడం కరెక్టా, కాదా అనేది చర్చనీయాంశం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం దుమారం సృష్టించింది.
మే 10 గాడ్సే పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి నివాళులర్పించిన నాగబాబు, "ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గ్యూమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవాలనిపించింది. పాపం నాధురాం గాడ్సే... మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్." అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో అవాక్కయిన నెటిజన్లతో పాటు మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఆయనను దుమ్మెత్తి పోశారు. ట్రోలింగ్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు.
బాలు కోంపల్లి అనే జనసేన కార్యకర్త, "ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం, రాజకీయంకి సంబంధం లేని ట్వీట్లు వేయడం వల్ల 2019 ఎన్నికల్లో మన పార్టీ సిద్ధాంతం జనాల్లోకి వెళ్ళలేదు. మీరు ఎలాగు పార్టీకి నిలబడలేరు. గోపిల్లాగా ఉంటున్నారు. కొంచెం సబ్జెక్ట్ మీద మాట్లాడడం పార్టీకి మంచిది. 2009, 2019 ఎన్నికలని దృష్టిలో పెట్టుకోండి. మీ మాటలు ఎలా ఉన్నాయంటే "కసబ్ కూడా మంచి వాడే.. పాపం తను నమ్మిన సిద్దాంతం కోసం యుద్ధం చేశాడు. తన దేశభక్తిని శంకించలేం." అన్నట్లుంది. బిజేపిని తిట్టడం, మళ్ళీ కలవడం. ఏదో సర్దుకుపోయాం. మరీ ఇంతలా కలవక్కర్లేదు. మీ వల్ల మళ్ళీ జనసైనికులు గౌరవం పోయేలా చేస్తున్నారు. ఆపండి అన్న.." అంటూ హితబోధ చేశాడు.
ఐ అనే అకౌంట్ పెట్టుకున్న అతను, "స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకిన RSS వాది ఈ గాడ్సే.
గాంధీ గారినే కాదు మీ లాంటి సామాన్యుడిని చంపినా కూడా హంతకుడే అవుతాడు. గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడు అవ్వడు హంతకుడే అవుతాడు. మీకు బీజేపీ నచ్చితే బీజేపీ మాటలు మాట్లాడితే ఎలా? చరిత్ర అనేది ఒకటి ఉంది. అది తెల్సుకొండి ముందు" అని చురకలు వేశాడు.
విజయసారథి అనే అతను, "ఈ క్షణం నుండి...మీ పై ఉన్న అభిమానం..గౌరవం రెండూ పోయాయి. దిగజారడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మీ లెక్కన ప్రతీ హంతకుడికి కూడా ఒక కారణం ఉంటుంది..లాడెన్ తో సహా..! వాళ్ళ పుట్టిన రోజులకూ ఇలానే పోస్టులు పెడతారా?" అంటూ గట్టిగానే ప్రశ్నించాడు.
ఇలా వరుసపెట్టి అందరూ దాడి చేసేసరికి, తన వాదాన్ని సమర్థించుకోవడానికి 'నాధూరాం గాడ్సే చివరి మాట' అనే ఒక యూట్యూబ్ స్టోరీని షేర్ చేశాడు నాగబాబు.