ఈ కాంబినేషన్లు సెట్ అవ్వడం అసాధ్యమా?
on Feb 12, 2017

ఇండ్రస్ట్రీ నడిచేదే కాంబినేషన్ అనే మ్యాజిక్ మీద. ఫలానా దర్శకుడు, ఫలానా హీరో కలిశారోచ్ అని చెప్పుకొంటే ఆ సినిమా క్రేజ్‌పెరిగిపోతుంటుంది. ఫలానా హీరోతో, ఫలానా హీరోయిన్ జోడీ కడుతుంది అనగానే ఆ సినిమాపై ఫోకస్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు నడిచేదంతా మల్టీస్టారర్ల యుగం. ఇద్దరు హీరోలు కలసి చెట్టాపట్టాలేసుకొని ఒకేసారి కెమెరా ముందుకు వస్తుంటే చూడ్డానికి భలే బాగుంటుంది. అలా ఇద్దరు హీరోలు కలసి చేసిన సినిమాలన్నీ దాదాపుగా బాగానే ఆడాయి.
అందుకే మల్టీస్టారర్ సినిమాలపై మరింత క్రేజూ, మోజూ పెరుగుతూ వస్తోంది. ఏ ఇద్దరు హీరోలు కలసి సినిమా చేస్తారా అంటూ... అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫలానా కాంబినేషన్ వస్తే బాగుంటుంది కదా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇండ్రస్ట్రీ తలచుకొంటే సెట్ అవ్వని కాంబినేషన్ లేదు. కానీ... కొన్ని మల్టీస్టారర్లు ఎప్పటికీ సెట్ కావేమో అనిపిస్తోంది. దానికి రకరకాల కారణాలున్నాయి. అసాధ్యం అని భావిస్తున్న కొన్ని మల్టీస్టారర్ల పై ఓసారి ఫోకస్ చేస్తే...??
నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో బాలకృష్ణ - ఎన్టీఆర్ కలసి నటిస్తే బాగుంటుందని కలలు కంటున్నారు. బహుశా... అది సాధ్యం కాదేమో. బాలయ్య బాబాయ్‌తో కలసి నటించాలని వుంది అని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాడు. అది ఎన్టీఆర్‌కి తీరని కలలా మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య, ఎన్టీఆర్‌ల మధ్య కాస్త కమ్యునికేషన్ గ్యాప్ వచ్చింది. అది రోజు రోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఆ మధ్య బాలయ్య, ఎన్టీఆర్‌లు కాస్త బాగానే ఉండేవారు. ఒకరి ఫంక్షన్‌కి ఇంకొకరు వెళ్లేవరు. ఇప్పుడు కనీసం బాలయ్య పేరు ప్రస్తావించడానికి కూడా జంకుతున్నాడు ఎన్టీఆర్. ఈ దశలో వీరిద్దరి తో సినిమా అంటే.. అసాధ్యమే అని నందమూరి కాంపౌండ్ వర్గాలే చెబుతున్నాయి.
ఏ హీరోతో అయినా సరే కలసి నటించడానికి సిద్ధమే అంటుంటారు బాలకృష్ణ. అయితే.... ఆయన నుంచి ఇప్పటి వరకూ ఒక్క మల్టీస్టారర్ కూడా రాలేదు. చిరంజీవితో బాలయ్యకు స్నేహ సంబంధాలు బాగానే ఉన్నా, చిరుతో కూడా ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. భవిష్యత్తులో చిరుతో అయినా చేసే అవకాశం ఉంది గానీ, నాగార్జునతో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సినిమా చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈమధ్య ఈ ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఏవో గొడవలు మొదలయ్యాయని, అందుకే బాలయ్య తన వందో సినిమా ప్రారంభోత్సవానికి వెంకీ, చిరులను పిలిచి.. నాగ్ ని దూరం పెట్టాడని వీరిద్దరి కాంబోలో సినిమా రావడం అసాధ్యమని చెబుతున్నారు.
చిరు - నాగ్, వెంకీ - నాగ్, బాలయ్య - వెంకీ.. ఈ కాంబినేషన్లు ఎప్పుడో సెట్ అవ్వాల్సింది. అప్పుడే అవ్వలేదంటే... ఇప్పుడు కుదరడం కల్ల. ఈతరం హీరోలు కూడా అంతే. ఎన్టీఆర్ - పవన్‌లు కలసి ఓ సినిమాలో చేయమనండి చూద్దాం. మహేష్ - పవన్‌లు కలసి నటించినా అద్భుతమే. కానీ... ఎవరి భయాలు వాళ్లకున్నాయి. ఎవరి ఇమేజ్ లెక్కలు వాళ్లవి. అందుకే.. ఎవ్వరూ ముందుకు రావడం లేదు. తమ సీనియర్లతో కలసి నటించడానికి సై అన్న మహేష్, పవన్‌లు.. తమ సమ ఉజ్జీలతో సినిమా చేయడానికి జంకుతున్నారు. ఇప్పుడే కాదు.. మరో ఐదేళ్లు పోయినా... ఈ కాంబినేషన్లలో సినిమా రావడం అసాధ్యమే.
ముందు హీరోలు తమ ఇమేజ్ ఛట్రాల నుంచి బయటపడాలి. ఏ హీరోతో కలసి నటిస్తే ఏముందిలే.. అనుకోవాలి. ఆ ధైర్యం చేసినప్పుడే.. కొత్త తరహా సినిమాలొస్తాయి. కొత్త కథల్ని చూసే అవకాశం దక్కుతుంది. మరి... మన స్టార్లు ఎప్పుడు మారతారో, ఈ మల్టీస్టారర్లు ఎప్పుడొస్తాయో...?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



