అలా చేస్తే మేం మౌనంగా ఉండం.. అంతా ఏకమై నిలబడతాం!
on Oct 3, 2024
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ సురేఖ చేసిన వ్యాఖ్యల్లో నాగార్జున, నాగచైతన్య, సమంత పేర్లను కూడా ప్రస్తావించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. నాగార్జున దీనిపై స్పందిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఆయనకు సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున స్పందిస్తూ ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలేమిటో చూద్దాం.
‘సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ, ఇతర రంగాల వలె పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. కానీ, నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. కానీ, మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం లేదా వారి వ్యక్తిగత జీవితాలను అబద్దపు ఆరోపణలలోకి లాగబడటం ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి రాజకీయ కథనాల కోసం, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మా నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడకండి. చితపరిశ్రమలో పని చేసేవారంతా సమాజానికి వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు అని మునస్పూర్తిగా కోరుకుంటున్నాను. మనమంతా ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాల పైన వచ్చే అబద్దపు కథనాల వలన కలిగే బాధ చాలా తీవ్రమైనది. ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలు, బాధను కలిగిస్తాయి. పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్ర పరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండము. ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతాం’’ అని మంచు విష్ణు తన లేఖలో పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



