లక్ష్మీ మంచు బర్త్‌డే.. గుండెను తడిచేసే తండ్రి మోహన్‌బాబు విషెస్!
on Oct 8, 2020
తల్లి కంటే తండ్రికే కూతురు ఎక్కువ సన్నిహితంగా ఉంటుండటం అనేక ఇళ్లల్లో మనం చూస్తుంటాం. కూతురికి తల్లి క్రమశిక్షణ నేర్పించాలని చూస్తే, అందుకు భిన్నంగా కూతురితో కలిసి అల్లరి చేస్తుంటాడు తండ్రి. తండ్రీకూతుళ్ల బంధం అపూర్వమైంది. ఒక అమ్మాయి జీవితంలో తొలి పురుషుడు తండ్రే కదా! తండ్రికెప్పుడూ తన తనయ యువరాణే. మోహన్‌బాబు, లక్ష్మీ మంచు విషయంలోనూ ఇది నూటికి నూరుపాళ్లూ నిజమనిపిస్తుంది.
అక్టోబర్ 8 గురువారం లక్ష్మి పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రి మోహన్‌బాబు ఒక అందమైన, భావోద్వేగపూరితమైన శుభాకాంక్షలను అందించారు. తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పాత పిక్చర్‌ను ఆయన షేర్ చేశారు. షూటింగ్ కెమెరా పక్కన చిన్నారి లక్ష్మిని ఎత్తుకొని నవ్వుముఖంతో మోహన్‌బాబు కనిపిస్తుంటే, లక్ష్మి దేన్నో ఆసక్తిగా చూస్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. ఆ ఫొటోనే ఎంతో అందంగా ఉందనుకుంటే, దాంతో పాటు మోహన్‌బాబు పంచుకున్న మాటలు మరింత అందంగా ఉన్నాయి.
"నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈరోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలీదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీప్రసన్నే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాల్ని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే టు మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు" అని ఆయన తెలుగులో నోట్ పెట్టారు.
సెప్టెంబర్ 27న డాటర్స్ డే సందర్భంగా లక్ష్మీ మంచు సైతం తండ్రిపై తనకున్న అనురాగాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు. అందులో ఆమె తండ్రి ఒడిలో కూర్చున్న ఇప్పటి పిక్చర్‌ను షేర్ చేసి, "ఆయన కూతుర్ని కావడం నాకు దక్కిన భాగ్యం, ఈ అద్భుతమైన మనిషి సురక్షిత చేతుల్లో ఉండటం నాకు లభించిన ఆశీర్వాదం. నేను యువరాణిని.. నాకొక యువరాజు ఉన్నాడని కాదు, రాజు లాంటి నా తండ్రి కారణంగా. ఐ లవ్ యు డాడీ, నువ్వే నా సర్వస్వం! "అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. అదీ ఈ తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అపురూపమైన బంధం, అనురాగం!!