'మహానటి' ఏ ఒక్కరో కాదు.. అందరూ మహానటిలే: జయసుధ
on Sep 3, 2019
ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనీ, వారిలో ఒకరు మోహన్‌బాబు అయితే, మరొకరు మురళీమోహన్ అనీ సహజనటిగా పేరుపొందిన జయసుధ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. మనం 'మహానటి' అనే మాటను ఒకరికే ఉపయోగిస్తుంటామనీ, కానీ అందరూ మహానటిలేననీ ఆమె అన్నారు. జయసుధకు 'అభినయ మయూరి' అనే ఆవార్డును ఇవ్వనున్నట్లు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఆ అవార్డును ప్రదానం చేయనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో జయసుధ మాట్లాడారు.
"ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒకరు మోహన్‌బాబు గారైతే, మరొకరు మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారితో హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో నటించాను. వాటిలో ఎన్నో సక్సెస్ అయ్యాయి. మహానటి అంటే మనం ఒక్కరే అనుకుంటాం. అందరూ మహానటిలే. మహనటి అయితే తప్ప ఇండస్ట్రీలో సస్టైన్ అవలేం. జమున గారి నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నా. ఆమెకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. వాటిని శాక్రిఫైస్ చెయ్యకుండా సక్సెసయ్యారు. మురళీమోహన్ గారు ఎవర్‌గ్రీన్ హీరో. ఆయన (జుట్టుకి) కలర్ వేసుకున్నా, వేసుకోకపోయినా యువకుడిలాగే కనిపిస్తారు. మా ఇంట్లో జీన్స్ ప్రకారం నా జుట్టు ఊడిపోతోంది. అవార్డులు రాకపోయినా ఫర్వాలేదని అంటుంటాం కానీ, అవార్డులు వస్తే మనసులో సంతోషంగా అనిపిస్తుంది. అవార్డు అనేది మనం చేసిన పనికి గుర్తింపు. కొన్ని అవార్డులు ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉదాహరణకు నంది అవార్డులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టేశాయి. తమిళనాడు ప్రభుత్వం సినిమా ప్రముఖులకు కలైమామణి అవార్డు ఇస్తూ వస్తోంది. వాళ్లు దాన్ని బాగా చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఏ పేరుతో ఇస్తారో.. ఇవ్వాలి. వాళ్లే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? మేం చాలా కార్యక్రమాలకు వస్తుంటాం. సోషల్ వర్క్‌కు రావాలంటే వస్తాం. అలాంటి మమ్మల్ని గుర్తించి అవార్డులిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల నవ తరానికి కూడా అవార్డు విలువ తెలుస్తుంది. ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా సుబ్బరామిరెడ్డి గారు ఆయన బర్త్‌డేకి అవార్డులు ఇస్తుంటారు" అని ఆమె అన్నారు.