నంది అవార్డులను పట్టించుకోరా?: మురళీమోహన్
on Sep 3, 2019
రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అవార్డుల విషయంలో కొంత సంశయం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం నంది అవార్డులను ఇచ్చేది. విభజన తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి 2014, 15, 16 సంవత్సరాలకు నందులు ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ 'లెజెండ్'కు తొమ్మిది అవార్డులు రావడం, మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని 'బన్నీ' వాసు గొంతు విప్పడంతో నంది అవార్డులు వివాదోనంది అవార్డులుగా వార్తల్లో నిలిచాయి. ఆ అవార్డులను ఇప్పటికీ అందజేయలేదు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం 'సింహా' పేరుతో అవార్డులు ఇస్తారని ప్రచారం జరిగినా... ఆ ప్రయత్నాన్ని కెసిఆర్ ప్రభుత్వం విరమించుకుంది. అటు నంది, ఇటు సింహా అవార్డుల గురించి దాదాపుగా ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు మరిచిపోయాయి.
టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న విశాఖలో జయసుధకు 'అభినయ మయూరి' అవార్డు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీమోహన్ నంది అవార్డుల గురించి ప్రస్తావించారు. "ఆరేడేళ్లుగా ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వడం లేదు. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటి ప్రభుత్వం ఈ విషయం గుర్తించి, పాతవి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని మురళీమోహన్ అన్నారు. జయసుధ మాట్లాడుతూ "అవార్డులు ఇస్తే కళాకారులకు సంతోషం. ఇన్నాళ్లు కష్టపడి పనిచేసిన దానికి గుర్తింపుగా భావిస్తాం. ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వాలని కోరుతున్నాను. ప్రభుత్వాలు అవార్డులను గుర్తించకాపోతే ఎలా?" అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం, కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం అవార్డుల గురించి స్పందిస్తాయో? లేదో?