మెహరీన్... నిర్మాత గొడవలో కొత్త ట్విస్ట్
on Feb 24, 2020
నాగశౌర్య కథ రాయడంతో పాటు హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ విడుదలైంది. కొంతమంది ప్రేక్షకులను, ముఖ్యంగా థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవాళ్లను ఆకట్టుకుంది. ఆల్రెడీ థియేటర్ల నుండి సినిమా వెళ్లింది. రీల్ లైఫ్‌లో నాగశౌర్యను ప్రేమించిన అమ్మాయిగా హీరోయిన్ మెహరీన్ కనిపించింది. రియల్ లైఫ్‌లో మాత్రం నాగశౌర్య, అతడి తండ్రిపై ఒక రేంజ్‌లో విరుచుకుపడుతోంది. నాగశౌర్య తల్లితండ్రులు ఉషా, శంకర్ ప్రసాద్ దంపతులు ‘అశ్వథ్థామ’ నిర్మించారు. అసలు, వీళ్ల మధ్య గొడవ ఏంటంటే....
రెండు మూడు రోజుల క్రితం ఒక ఇంగ్లిష్ డైలీతో మెహరీన్ మాట్లాడింది. ‘అశ్వథ్థామ’ నిర్మాతలు తనతో హుందాగా ప్రవర్తించలేదనీ, హోటల్ బిల్లులు కట్టనని చెబితే అర్ధాంతరంగా ఖాళీ చేసి వెళ్లానని చెప్పింది. మెహరీన్ మాటలు నిర్మాతలకు మంట తెప్పించాయి. రెమ్యూనరేషన్ కాకుండా మెహరీన్ హోటల్, ఫుడ్ బిల్లులకు ఎంత ఖర్చు చేసిందీ బయటపెట్టారు. మెహరీన్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్‌కు దగ్గర దగ్గర ఆరు లక్షలు చెల్లించామని లెక్కలు చెప్పారు. పైగా, ప్రమోషన్ కార్యక్రమాలకు సరిగా హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి మెహరీన్ మళ్లీ బయటకొచ్చారు. ట్విట్టర్ వేదికగా నిర్మాతలపై ఘాటుగా విమర్శలు చేశారు.
‘‘విమెన్ ఎంపర్‌మెంట్ మీద సినిమాలు తీస్తారు. కానీ, రియల్ లైఫ్‌లో మహిళలకు గౌరవం ఇవ్వనప్పుడు అటువంటి సినిమాలు తీయడంలో అర్థం ఏముంది? నా ఆత్మ గౌరవం, హుందాతనం విషయంలో నాకోసం నేను నిలబడతా. (నోరు విప్పుతా అని) పరస్ఫర గౌరవం ఉండాలి’’ అని మెహరీన్ ట్వీట్ చేశారు. దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.