వెండితెరపై నటిగా లక్ష్మీపార్వతి!
on Feb 24, 2020
దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు. 'రాధాకృష్ణ' అనే మూవీలో ఆమె ఒక కీలక పాత్ర చేస్తున్నారు. కనుమరుగు అవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో, పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక ప్రేమకథను తెరకెక్కిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రసాద్ వర్మ.
అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటిస్తోన్న ఈ లవ్ స్టోరీలో సంపూర్ణేష్ బాబు కూడా మరో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. డైరెక్టర్ 'ఢమరుకం' శ్రీనివాసరెడ్డి సమర్పిస్తోన్న ఈ మూవీని హరిణి ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానూరు కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూరుస్తుండగా, టి. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
ఆమధ్య రాంగోపాల్ వర్మ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా సదర్భంగా వార్తల్లో నిలిచిన లక్ష్మీపార్వతి కెమెరా ముందుకు వచ్చి నటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెరపై ఆమె ఎలా కనిపిస్తారనే ఆసక్తి కొంతమందిలోనైనా వ్యక్తమవుతోంది. గతంలో ఆమె కుమారుడు కోటేశ్వరప్రసాద్ హీరోగా పరిచయమయ్యాడు కానీ, ఆ సినిమా ఆడకపోవడంతో అతను మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు.