చరణ్ ఆ 'దెబ్బ' మర్చిపోయాడా?
on Apr 16, 2016
ఏ హీరోకైనా ఫ్లాపులు సహజం. అయితే డిజాస్టర్ తగిలితే మాత్రం.. కెరీర్‌కి పెద్ద దెబ్బ తగిలినట్టే. రామ్‌చరణ్ కి ఆ అనుభవం జంజీర్‌తో ఎదురైంది. జంజీర్ చరణ్ ని మామూలు దెబ్బ కొట్టలేదు. ఆ సినిమా డిజాస్టర్ అయిన మాట అటుంచితే... బాలీవుడ్‌లో లెక్కలేనన్ని విమర్శలు మూటగట్టుకొన్నాడు. ఓ సంస్థ అయితే ఉత్తమ చెత్త నటుడు అవార్డుని రామ్‌చరణ్‌కి ప్రకటించింది. అదో ఘోర అవమానం. ఆ సినిమా తెలుగులో తుఫాన్‌గా విడుదల చేశారు. అదీ అట్టర్ ఫ్లాపే. అలా.. జంజీర్ దెబ్బ చరణ్‌ని కోలుకోనివ్వకుండా చేసింది.
అయితే.. ఇప్పుడు మళ్లీ.. బాలీవుడ్ పై దృష్టి పెట్టాడు రామ్ చరణ్. అక్కడ అర్జెంటుగా ఓ సినిమా చేసేయాలని పట్టుదలతో ఉన్నాడట. ఈ విషయమై చరణ్‌కి సల్మాన్ ఖాన్ కూడా సలహాలు ఇస్తున్నాడట. కావలిస్తే... ప్రొడక్షన్ నేను చూసుకొంటా.. అంటున్నాడట సల్లూభాయ్. సల్మాన్‌కీ చరణ్‌కీ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది లెండి.
జంజీర్ సమయంలో చరణ్ ముంబైలో మకాం ఉంటే.. చరణ్‌కి కావల్సినవన్నీ దగ్గరుండి చూసుకొన్నాడు సల్మాన్ ఖాన్. అంతేకాదు చరణ్ ముంబైలో ఓ ఇల్లు కొనాలనుకొన్నప్పుడు.. సలహా ఇచ్చింది సల్మాన్ ఖానే. అలా ఇద్దరి మధ్య మంచి స్నేహం పెరిగింది. చరణ్‌కి తగిన కథ చూసే బాధ్యత కూడా సల్మానే తీసుకొన్నాడని టాక్. మొత్తానికి చరణ్ బాలీవుడ్‌లో సినిమా చేయాలని బలంగా ఫిక్సయిపోయాడు. అక్కడ హిట్టుకొట్టేంత వరకూ.. వదిలేట్టు లేడు. జంజీర్‌కి వచ్చిన ఉత్తమ చెత్త నటుడు అవార్డుకు ప్రతీకారంగా... అక్కడ నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు చరణ్. మరి ఈసారి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో చూడాలి.