2019 చివరి హిట్ 'మత్తు వదలరా'
on Dec 29, 2019
ఈ రోజుల్లో చిన్న సినిమాలు హిట్టవ్వాలంటే ఆషామాషీ విషయం కాదు. కేవలం కంటెంట్ ఉంటే చాలదు.. పబ్లిసిటీ, మౌత్ టాక్ కూడా చాలా ముఖ్యం. అలా పబ్లిసిటీ, మౌత్ టాక్‌తో సూపర్ హిట్టయిన సినిమా 'మత్తు వదలరా'. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయమైన ఈ సినిమాతో దర్శకుడిగా రితేశ్ రాణా, సంగీత దర్శకుడిగా కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ పరిచయమయ్యారు. కొత్త తరహా కంటెంట్, స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. అంతే కాదు, సినిమా బాగుందనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో తొలిరోజు కేవలం 20 నుంచి 25 శాతమే నిండి కనిపించిన థియేటర్లు.. రెండో రోజు నుంచీ 50 శాతం పైగా నిండుతూ ఇప్పుడు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అంతే కాదు, డిమాండ్ పెరగడంతో నిర్మాతలు థియేటర్ల సంఖ్యనూ పెంచారు. కేవలం రూ. 1.5 కోటితో తయారైన ఈ సినిమా.. ప్రస్తుత ట్రెండ్ దృష్ట్యా చూస్తే, సునాయాసంగా ఆరేడు కోట్ల షేర్ సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది 'ఫలక్‌నుమా దాస్', 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ', 'బ్రోచేవారెవరురా', 'ఎవరు' సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర ఆశ్చర్యకర ఫలితాలు సాధించాయి. ఇప్పుడు వాటి సరసన 'మత్తు వదలరా' సినిమా నిలిచింది. పెద్ద సినిమాలే ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోతున్న కాలంలో ఈ చిన్న సినిమాలు.. కంటెంట్, మౌత్ టాక్‌తో వాళ్లను అలరిస్తుండటం మంచి పరిణామంగా చెప్పుకోవాలి. 'మత్తు వదలరా' విజయం కంటెంటే కింగ్ అనే విషయంతో పాటు మౌత్ టాక్ కూడా ఇంపార్టెంటే అనే విషయాన్నీ నిరూపించింది. ఈ తరహా కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్‌ని ప్రేక్షకులు ఆదరిస్తుంటే, తెలుగు సినిమాకు రానున్న కాలం ఉజ్జ్వలంగా ఉంటుందని చెప్పడానికి వెనుకాడాల్సిన పనిలేదు.