'సరిలేరు నీకెవ్వరు'లో సినీ స్టార్‌గా తమన్నా!
on Dec 28, 2019
మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'సరిలేరు నీకెవ్వరు'కు సంబంధించి ఈ డిసెంబరులో ప్రతి సోమవారం ఒక పాటను మూవీ యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి నాలుగు సోమవారాలు నాలుగు పాటలు విడుదలయ్యాయి. డిసెంబర్ 30న వచ్చే చివరి సోమవారం ఆల్బంలోని 'డాంగ్ డాంగ్' అంటూ సాగే చివరి పాటను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ పాటను మహేశ్, తమన్నాపై చిత్రీకరించారు. ఈ సాంగ్ ప్రోమోను ప్రస్తుతం జరుగుతున్న విశాఖ ఉత్సవంలో రిలీజ్ చేశారు. ఏ సందర్భంలో ఈ పాట వస్తుందో ఒక వీడియో ద్వారా తెలియజేశాడు అనిల్ రావిపూడి. అందరూ అనుకుటున్నట్లు ఇది ఐటం సాంగ్ కాదని, ఒక పార్టీ సాంగ్ అని ఆయన చెప్పాడు.
"సరిలేరు నీకెవ్వరు సాంగ్స్‌ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దేవి శ్రీప్రసాద్‌కు నా స్పెషల్ థాంక్స్. చాలా మంచి పాటలిచ్చాడు. ఈ నెలలో ప్రతి సోమవారం ఒక పాటతో మీ ముందుకొచ్చాం. ప్రతి పాటను బాగా రిసీవ్ చేసుకున్నారు. టిక్ టాక్‌లో వాటిని వీడియోస్ చేసి ట్రెండ్ చేశారు. పోయిన సోమవారం రిలీజ్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' యాంతంను కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సోమవారం ఆల్బంలోని చివరి పాట.. ఒక పార్టీ సాంగ్‌తో మీముందుకు రాబోతున్నాం. మహేశ్, తమన్నాపై తీసిన పాట. ఆర్మీ పీపుల్‌ను కొంతమంది సినీ స్టార్స్‌తో ఇంటరాక్ట్ చేయించిన వీడియో ఒకసారి చూశాను. దానికి ఇన్‌స్పైర్ అయ్యి చేసిన పాట ఇది. సినిమాలో తమన్నా ఒక సినీ స్టార్‌గానే వచ్చి ఆర్మీవాళ్లతో ఇంటరాక్ట్ అవుతుంది. ఆ సందర్భంగా వచ్చే సరదా పాట ఇది. కచ్చితంగా ఈ సాంగ్‌ను కూడా ఎంజాయ్ చేస్తారు. చాలామంది దీన్ని ఐటం సాంగ్ అనుకుంటున్నారు. ఇది ఐటం సాంగ్ కాదు, ఒక మంచి పార్టీ సాంగ్, మంచి జోష్‌తో ఉండే సాంగ్. ఈ సాంగ్ కూడా ఎగ్జైట్ చేస్తుందని ఆశిస్తున్నా. ఈ సంవత్సరం సంక్రాంతికి మర్చిపోలేని గిఫ్ట్ ('ఎఫ్2') ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వచ్చే సంక్రాంతికి అంతే ఎంటర్‌టైన్‌మెంట్‌తో, అంతకు మించి సూపర్ స్టార్ మహేశ్ ఒక కొత్త కథతో మీ ముందుకు రాబోతున్నారు. 13 ఏళ్ల తర్వాత విజయశాంతిగారు మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. 2020 సంక్రాంతి స్పెషల్ కాబోతోంది. డోన్ట్ మిస్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ" అని చెప్పాడు అనిల్ రావిపూడి. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ జనవరి 11న విడుదలవుతోంది.