నిన్నటి కలల రాణి మందాకిని ఇప్పుడు ఏం చేస్తున్నారు?
on Dec 7, 2020
1980లలో యువతరం కలల రాణిగా పేరు తెచ్చుకొని, వారి హృదయాల్లో అలజడి రేపిన మందాకిని గుర్తుంది కదా! పెళ్లితో సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంటోంది? ఏం చేస్తోంది? అనే ప్రశ్న చాలా మందిని తొలుస్తూ ఉంటుంది. లెజెండరీ డైరెక్టర్ రాజ్ కపూర్ డిస్కవరీగా 'రామ్ తేరీ గంగా మైలీ' (1985)లో నాయికగా నటించి, తొలి సినిమాతోటే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది మందాకిని. మీరట్‌కు చెందిన ఓ ఆంగ్లో ఇండియన్ కుటుంబానికి చెందిన మందాకిని అసలు పేరు యాస్మీన్ జోసెఫ్. ఆమె పేరును మందాకినిగా మార్చింది రాజ్ కపూరే.
హిందీకి పరిచయమైన మరుసటి ఏడాదే సూపర్‌స్టార్ కృష్ణ 'సింహాసనం' (1986) చిత్రంలో తన సరసన నటింపజేయడం ద్వారా ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత 'భార్గవరాముడు'లో సెకండ్ హీరోయిన్‌గా బాలకృష్ణతో ఆమె నటించింది. ఐదేళ్ల పాటు విరివిగా హిందీ సినిమాల్లో నటించిన మందాకిని 1990లో ఓ బౌద్ధ భిక్షువును పెళ్లాడటం గమనార్హం. పెళ్లికి ముందు ఆమె నటించిన కొన్ని సినిమాలు పెళ్లి తర్వాత విడుదలయ్యాయి. వివాహానంతరం మందాకిని సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేశారు.
ఆమె భర్త డాక్టర్ కగ్యూర్ టి. రింపోచే ఠాకుర్ కూడా ఫేమస్ పర్సనాలిటీయే. మర్ఫీ రేడియో యాడ్స్‌లో బాలనటుడిగా నటించిన చరిత్ర ఆయనది. ముంబైలో సెటిల్ అయిన భార్యాభర్తలు ప్రస్తుతం టిబెటన్ యోగా క్లాసులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు.