ప్రకాశ్‌రాజ్ ప్యానల్లోని 11 మంది రాజీనామాతో మంచు విష్ణుకు బంపర్ ఆఫర్!
on Oct 13, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందిన 11 మంది రాజీనామా చేయడంతో, మంచు విష్ణు ప్యానల్లో ఓడిన సభ్యులకు ఆ స్థానాలను భర్తీ చేసే గోల్డెన్ చాన్స్ లభించింది. ప్రెసిడెంట్‌గా తనకున్న పవర్‌తో ప్రకాశ్‌రాజ్ శిబిరానికి చెందిన 11 మంది సభ్యుల స్థానాల్లో తన ప్యానల్ మెంబర్స్‌ను తీసుకొనే చాన్స్ విష్ణుకు దొరికింది. మా ఎలక్షన్స్‌లో ఒకే ప్యానల్ గెలవాలనే కోరిక ఈ రకంగా నెరవేరుతుండటం 'మా' హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.
'మా' ఎన్నికలు ముగిసి, వివాదాలు ముగిసి, ప్రశాంత వాతావరణం ఏర్పడిందనుకుంటున్న తరుణంలో ప్రెసిడెంట్‌గా పోటీచేసి ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ తీసుకున్న డెసిషన్స్‌తో వేడి చల్లారలేదు. ప్రకాశ్‌రాజ్ 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేయడంతో పాటు, తన ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది మెంబర్స్‌తోనూ వ్యూహాత్మకంగా రాజీనామా చేయించారు. విష్ణు అధ్యక్షతన పనిచేయాలంటే భయమేస్తోందనీ, 'మా' సభ్యుల సంక్షేమానికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన బెనర్జీ, జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఉత్తేజ్‌తో పాటు ఈసీ మెంబర్స్‌గా ఎన్నికైన ఎనిమిది మంది రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారు.
వీరి రాజీనామాలతో 'మా'లో రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు అలాగే ఉన్నాయనే విషయం స్పష్టమైంది. అధ్యక్షుడిగా గెలుపొందిన సభ్యుడి ఆధ్వర్యంలో మిగతా అందరూ పనిచేయాల్సి ఉంటుంది. ఆఫీస్ బేరర్స్ కానీ, ఈసీ మెంబర్స్ కానీ ఏ ప్యానల్‌కు చెందిన వారైనా కలిసికట్టుగా 'మా' సభ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలి. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందిన 11 మంది రాజీనామా చేసినా మంచు విష్ణు పదవికి వచ్చే ఇబ్బందేమీ లేదని 'మా' బైలాస్ చెబుతున్నాయి. కార్యవర్గంలో మొత్తం 26 మంది ఉండాల్సి ఉండగా, విష్ణు ప్యానల్‌కు చెందినవారు 15 మంది గెలుపొందారు. బైలాస్ ప్రకారం కార్యవర్గంలో తొమ్మది.. అంతకంటే ఎక్కువమంది ఉంటే ఆ కార్యవర్గం తమ కార్యకలాపాల్ని కొనసాగించవచ్చు. దాంతో విష్ణు ఎలాంటి ఆటంకాలు లేకుండా తన బాధ్యతల్ని నిర్వహించుకొనే వీలుంది.
కాగా ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందిన 11 మంది తమ పదవుల నుంచి తప్పుకోవడంతో, వారి స్థానాల్లో తనకు నచ్చినవారిని ఎంచుకొనే అధికారం ప్రెసిడెంట్‌గా విష్ణుకు ఉంది. కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఏర్పాటుచేసి, తన ప్యానల్ నుంచి ఓడిపోయిన వారితో ఆ స్థానాలను భర్తీ చేసుకోవచ్చు. ప్రకాశ్‌రాజ్ వర్గీయులంతా రాజీనామా చేయడం విష్ణుకు కలిసివచ్చే విషయమేనని విశ్లేషకులు అంటున్నారు. కార్యవర్గంలో ఏ పదవి అయినా ఖాళీ అయితే మరో సభ్యుడితో దాన్ని భర్తీ చేసే చాన్స్ అధ్యక్షుడిదే. దీంతో శ్రీకాంత్‌తో పోటీచేసి ఓటమి పాలైన సీనియర్ యాక్టర్ బాబూమోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, బెనర్జీతో పోటీపడి ఓటమి పాలైన మాదాల రవి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
Also Read