సినిమాల్లో నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ఆమె ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా తన 'టీచ్ ఫర్ చేంజ్' స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఏకంగా 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా సోమవారం సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మంచు లక్ష్మి సందర్శించారు. అక్కడ టీచ్ ఫర్ చేంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. గ్రామీణ విద్యార్థులకు కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆధునిక విద్యా సదుపాయాలు అందించాలన్నదే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. దత్తత తీసుకున్న పాఠశాలల్లో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు.
కేవలం డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. పిల్లలకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఆధునిక బోధనా పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడంపైనా ఈ సంస్థ దృష్టి పెడుతోంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, ఫోనిక్స్, చదివే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలన్నది తమ ప్రయత్నమని తెలిపారు.
మంచు లక్ష్మి ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ 'టీచ్ ఫర్ చేంజ్' ద్వారా తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, విద్యా సంబంధిత సహకారం అందించారు. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో 48 పాఠశాలలను దత్తత తీసుకోవడం మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు కూడా ఆధునిక విద్య అందుబాటులోకి రావాలంటే ఇలాంటి ప్రయత్నాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
[Manchu Lakshmi, Manchu Lakshmi Teach For Change, Manchu Lakshmi Adopted Schools, 48 Government Schools, Teach For Change NGO, Manchu Lakshmi Social Service, Telangana Government Schools, Digital Smart Classrooms]





