మహేశ్ సినిమాపై ఐటీ "ఐ"..?
on Dec 2, 2016
సినిమా కలెక్షన్ల విషయంలో దర్శక నిర్మాతలు నిజం చెబుతారని నమ్మలేం..నలుగురి ముందు తమ సినిమా గొప్పదని నిరూపించడానికి కలెక్షన్లు అంతొచ్చాయి..ఇంతొచ్చాయి అని గొప్పలు చెప్పుకుంటుంటారు. ఆ గొప్పలే దర్శకనిర్మాతలకు ఇప్పుడు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. బాహుబలి-1 భారీ వసూళ్లు సాధించడంతో..బాహుబలి-2 విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిందని ప్రచారం జరగడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. బాహుబలి నిర్మాతల కార్యాలయాలపై దాడులు చేసి బ్లాక్ మనీ సీజ్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం ఏఆర్ మురగదాస్ డైరెక్షన్‌లో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమాకు ఇప్పుడు ఐటీ భయం పట్టుకుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ని సుమారు 30 కోట్లకు అమ్మారని ప్రచారం జరగడమే అందుకు కారణం..దానికి తోడు సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని మరో ప్రచారం జరగడం కూడా దర్శకనిర్మాతలను ఉలిక్కిపడేలా చేస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసి బ్లాక్ మనీపై ప్రధాని అమీతుమీకి సిద్ధమవ్వడంతో దేశంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఐటీ శాఖ నిఘా మరింత ఎక్కువైంది. ఎప్పుడు..ఎవరి మీద ఐటీ పంజా విసురుతుందో తెలియక జనం గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఆ లిస్ట్‌లో ఫస్ట్ ఉంది సినీ పరిశ్రమే.