మదగజరాజ మూవీ రివ్యూ
on Jan 31, 2025
తారాగణం: విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్, అంజలి, సంతానం, సోనూసూద్, మనోబాల తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోని
డీఓపీ: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, ఎన్.బి. శ్రీకాంత్
రచన: వెంకట్ రాఘవ, సుందర్ సి
దర్శకత్వం: సుందర్ సి
బ్యానర్: జెమినీ ఫిలిం సర్క్యూట్
విడుదల తేదీ: జనవరి 31, 2025
విశాల్, వరలక్ష్మీ శరత్‌కుమార్, అంజలి, సంతానం, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మదగజరాజ'. ఏవో కారణాల వల్ల పుష్కరకాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రం, ఎట్టకేలకు ఈ ఏడాది పొంగల్ కానుకగా జనవరి 12న తమిళ్ లో విడుదలైంది. 12 ఏళ్ళ తర్వాత విడుదలైనప్పటికీ, ఈ చిత్రం మంచి వసూళ్లతో ఊహించని విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 'మదగజరాజ' చిత్రం ఎలా ఉంది? 12 ఏళ్ళ తర్వాత విడుదలైనా, విజయం సాధించే అంతలా ఈ సినిమాలో ఏముంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Madha Gaja Raja Review)
కథ:
మదగజరాజ అలియాస్ ఎంజీఆర్ అలియాస్ రాజా (విశాల్) ఓ కేబుల్ ఆపరేటర్. ఇతరులకు సాయం చేయడంలో తన ఆనందాన్ని వెతుక్కునే యువకుడు. తనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టారు కూతురి పెళ్లికి తన బాల్య స్నేహితులతో కలిసి వెళ్తాడు రాజా. అక్కడ మాస్టారుకి ఒక పెద్ద సమస్య ఎదురవ్వగా, దానిని తీరుస్తాడు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవ్వబోతుండగా, తన స్నేహితులు కూడా రకరకాల సమస్యల్లో ఉన్నారని తెలుసుకుంటాడు రాజా. ఆ సమస్యలకు కారకుడు కాకర్ల విశ్వనాథ్ (సోనూసూద్) అని తెలుస్తుంది. ప్రభుత్వాన్నే శాసించే స్థాయిలో ఉన్న విశ్వనాథ్ ను రాజా ఎలా ఢీ కొట్టాడు? అసలు రాజా స్నేహితులకు వచ్చిన కష్టం ఏంటి? విశ్వనాథ్ కి రాజా ఎలా బుద్ధి చెప్పాడు? ఈ కథలో వరలక్ష్మీ శరత్‌కుమార్, అంజలి, సంతానం పాత్రలు ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
కమర్షియల్ సినిమాలు దాదాపు ఒకే టెంప్లేట్ లో సాగుతుంటాయి. ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం రూపొందిన ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కథాకథనాల్లో కొత్తదనం ఆశించడం అత్యాశే అవుతుంది. 'మదగజరాజ' విషయంలో కూడా అదే జరిగింది. కథాకథనాల్లో ఎలాంటి మెరుపులు ఉండవు. మాస్ ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా తీసిన యాక్షన్ కామెడీ ఫిల్మ్. కొన్నేళ్లుగా ఇలాంటి సినిమాలు రావట్లేదు. ఇప్పుడంతా భారీ సినిమాలు, వయలెన్స్ సినిమాలదే హవా. అదే 'మదగజరాజ'కు కలిసొచ్చిన అంశం. కాసేపు సరదాగా నవ్వుకుందాం అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే దానికి కూడా షరతులు వర్తిస్తాయి. కథాకథనాలు, లాజిక్స్ పట్టించుకోకుండా.. ఆ కామెడీని ఎంజాయ్ చేస్తేనే ఈ సినిమా నచ్చుతుంది. కథాకథనాల గురించి ఆలోచించినా, లాజిక్స్ వెతికినా.. ఆ కామెడీ సీన్స్ కి నవ్వు రాకపోగా, ఏంట్రా ఈ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది.
సింపుల్ గా చెప్పాలంటే సీఎంని సైతం శాసించే ఓ పవర్ ఫుల్ వ్యక్తిని, ఒక సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు అనేదే ఈ చిత్ర కథ. అలా అని, ఎత్తులు పైఎత్తులతో తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో కథనం సాగదు. కామెడీని ప్రధానంగా చేసుకొని ఈ చిత్రాన్ని మలిచారు. ముఖ్యంగా సంతానం కామెడీ 'మదగజరాజ'కి ప్రధాన బలంగా నిలిచింది. అతని కామెడీనే సినిమాని చాలా వరకు నిలబెట్టింది. మనోబాల పాత్ర చుట్టూ అల్లుకున్న కామెడీ ట్రాక్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అయితే చాలా చోట్ల దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. కొన్ని సీన్స్ అతిగా అనిపిస్తాయి. లాజిక్స్ ని పట్టించుకోకుండా, ఆ అతిని భరించగలిగితే.. కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. అయితే గ్లామర్ డోస్, మాటల్లో అతి ఫ్యామిలీ ఆడియన్స్ ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సీన్స్ మధ్య కనెక్టివిటీ కూడా సరిగా ఉండదు.
టెక్నికల్ గా ఇప్పుడు సినిమా ఎంతో అభివృద్ధి చెందింది. ఇది 12 ఏళ్ళ క్రితం నాటి సినిమా కాబట్టి.. ఇప్పటి సాంకేతికత, ప్రొడ్యూసర్ వాల్యూస్ తో పోలిస్తే పూర్ గానే అనిపిస్తుంది. విజయ్ ఆంటోని స్వరపరిచిన పాటలు పెద్దగా మెప్పించలేదు. నేపథ్య సంగీతం పరవాలేదు. కెమెరా, ఎడిటింగ్ విభాగాల పనితీరు కూడా పరవాలేదు. తెలుగు డబ్బింగ్ విషయంలో మరింత కేర్ తీసుకొని ఉండాల్సింది.
నటీనటుల పనితీరు:
యంగ్ లుక్ లో విశాల్ ఆకట్టుకున్నాడు. ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్త కాదు. రాజా పాత్రకి తగ్గట్టుగా ఎనర్జిటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కథలో వరలక్ష్మీ శరత్‌కుమార్, అంజలి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. గ్లామర్ ఒలకపోయాడానికే ఆ పాత్రలు పరిమితమయ్యాయి. సంతానం తనదైన కామెడీతో సినిమాని చాలా వరకు తన భుజాలపై లాక్కొచ్చాడు. మంత్రి సత్తిబాబుగా మనోబాల పాత్ర కూడా బాగానే నవ్విస్తుంది. విలన్ గా సోనూసూద్ తన మార్క్ చూపించాడు.
ఫైనల్ గా..
ఇది 12 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. కథాకథనాలను, లాజిక్స్ ని పట్టించుకోకుండా కామెడీని ఎంజాయ్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో చూస్తే 'మదగజరాజ' నచ్చే అవకాశాలు ఉన్నాయి.
రేటింగ్: 2.5/5

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
