తమ్ముడికి 'బేబీ'.. అన్నయ్యకి 'ఖుషి'
on Sep 3, 2023

దేవరకొండ బ్రదర్స్ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ ఏడాది 'బేబీ'తో బ్లాక్ బస్టర్ అందుకుంటే.. అన్నయ్య విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత 'ఖుషి'తో సక్సెస్ చూశాడు.
ఆనంద్ కి థియేటర్స్ లో మొదటి హిట్ 'బేబీ'నే. 'దొరసాని'తో హీరోగా పరిచయమైన ఆనంద్.. 'మిడిల్ క్లాస్ మెలోడీస్', 'పుష్పక విమానం', 'హైవే' వంటి సినిమాల్లో నటించాడు. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ అది నేరుగా ఓటీటీలో విడుదలైంది. అందుకే థియేటర్స్ లో విడుదలై మొదటి బ్లాక్ బస్టర్ ని అందించిన 'బేబీ' ఆనంద్ కి స్పెషల్. జూలై 14 న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.45 కోట్ల షేర్ రాబట్టి చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది.
ఇక రౌడీ స్టార్ విజయ్ కి కూడా ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి చిత్రాలతో తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగిన విజయ్.. 2018 లో వచ్చిన 'టాక్సీవాలా' తర్వాత విజయాన్ని చూసి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్లల్లో విజయ్ నుంచి 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్' అనే మూడు సినిమాలు రాగా.. మూడూ ఒకదాన్ని మించి ఒకటి పరాజయం పాలయ్యాయి. ఈ క్రమంలో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి' ఆయనకు ఊరటనిచ్చింది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఖుషి.. రెండు రోజుల్లో రూ.24 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.60 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ 2023 సంవత్సరం దేవరకొండ బ్రదర్స్ కి లక్కీ ఇయర్ అని చెప్పొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



