"బాలు లేకపోవడంతో అనేక రకాలుగా లూజర్‌ను అనిపిస్తోంది".. విశ్వనాథ్ భావోద్వేగం!
on Jun 4, 2021
.jpg)
కాశీనాథుని విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్‌లో ఎన్ని మధురమైన, ఎన్ని గొప్ప పాటలు వచ్చాయో! తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచే పాటలకు కావాల్సిన భూమికను విశ్వనాథ్ అందిస్తే, మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేసిన ఆ పాటలను తన గాత్రంతో మరో స్థాయికి తీసుకువెళ్లారు బాలు. ఉత్తమ గాయకునిగా బాలు ఆరుసార్లు జాతీయ పురస్కారాన్ని అందుకుంటే, వాటిలో రెండు సినిమాలకు దర్శకుడు కె. విశ్వనాథ్. బాలు తొలిసారిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది 'శంకరాభరణం' చిత్రంతో. అందులో పాడిన "ఓంకార నాదాను" పాట ఆయనకు ఆ అవార్డును అందించింది. ఆ తర్వాత మరోసారి 'సాగర సంగమం'లో పాడిన "వేదం అణువణువున నాదం" పాటతో ఉత్తమ గాయకుడిగా నిలిచారు బాలు.
విశ్వనాథ్‌ను "అన్నయ్యా" అని ఆప్యాయంగా బాలు పిలిస్తే, సొంత తమ్ముడిలా బాలుకు ఆత్మీయతను పంచారు విశ్వనాథ్. గత సెప్టెంబర్ 25న బాలు పరమపదించిన వార్త తెలిసినప్పుడు విశ్వనాథ్ కుమిలిపోయారు. బాలు మృతికి స్పందించాల్సి వచ్చినప్పుడు భావోద్వేగంతో సరిగా మాట్లాడలేకపోయారు. ఈరోజు ఆయన 75వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ ఉత్సవంలోనూ రెండు నిమిషాల కంటే మించి ఎక్కువ మాట్లాడలేదు విశ్వనాథ్.
"వాడు కారణజన్ముడు. ఆబాలగోపాలం మెచ్చుకున్న అమర గాయకుడు. ఒకవేళ మళ్లీ నేను సినిమా తీస్తే ఎవరు పాడతారా ఈ పాటలన్నీ అనిపించేటటువంటి లోటును క్రియేట్ చేసిన ఓ మహావ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అతనితో నాది జన్మజన్మల రుణానుబంధం. అతను పోవడంతో అనేక రకాలుగా నేను లూజర్‌ను అనిపిస్తోంది." అంటూ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు కె. విశ్వనాథ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



