లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం అందించిన తొలి తెలుగు సినిమా ఇదే!
on Oct 8, 2020
లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీత ద్వయం పేరు వినని సంగీత ప్రియులు ఉండరు. మూడున్నర దశాబ్దాల కెరీర్‌లో 635 సినిమాల దాకా వారు సంగీతం సమకూర్చారు. ప్రధానంగా హిందీ చిత్రాలకు సంగీతం అందించిన వారు వేళ్లమీద లెక్కించదగ్గ సంఖ్యలో ఇతర భాషా చిత్రాలకు బాణీలు సమకూర్చారు. వారు పనిచేసిన తెలుగు సినిమాలు రెండే రెండు అయితే.. ఆ రెండూ నాగార్జునవే కావడం విశేషం. ఆ సినిమాలు.. 'మజ్ను', 'నేటి సిద్ధార్థ'.
దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన 'మజ్ను' మ్యూజికల్‌గా, బాక్సాఫీస్ పరంగా ఘన విజయం సాధిస్తే, క్రాంతికుమార్ రూపొందించిన 'నేటి సిద్ధార్థ' బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది కానీ మ్యూజికల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఉదాహరణకు 'ఓసి మనసా నీకు తెలుసా', 'నీవే కదా నా స్వీటు ఫిగరు' పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
హిందీలో టాప్ పొజిషన్‌లో ఉన్న టైమ్‌లో వారు 'మజ్ను' సినిమాకు సంగీతం అందించడానికి ఎలా ఒప్పుకున్నారంటే.. డైరెక్టర్ దాసరి నారాయణరావు వల్లే. ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని హిందీ సినిమాలకు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీత దర్శకులుగా పనిచేశారు. ఆ సాన్నిహిత్యంతో దాసరి అడగ్గానే పనిచేయడానికి వారు అంగీకరించారు.
'మజ్ను' మూవీ సంగీత ప్రధాన ప్రణయ గాథ. హీరో నాగార్జున గిటారిస్ట్. అందువల్ల సంగీతం ప్రేక్షకుల హృదయ తంత్రులను మీటే విధంగా ఉండాలి. కథను, హీరో పాత్రను బాగా అర్థం చేసుకున్న లక్ష్మీకాంత్-ప్యారేలాల్ రాగరంజితమైన మధుర స్వరాలను కూర్చారు. 'నేనే నేనే నేనే హీరో' సాంగ్ ఎంత హుషారుగా సాగుతుందో, 'ఇది తొలిరాత్రి' పాట అంత విషాదాన్ని పలుకుతూ నడుస్తుంది. రెండూ ప్రేక్షకుల నాలుకలపై నర్తించాయి. దాసరి, నాగార్జున తొలి కలయికలో వచ్చిన మజ్ను చిత్రం ఇద్దరికీ మరపురాని అనుభూతులను మిగిల్చింది.
Also Read