పూజా హెగ్డే.. అక్కడ కూడా అదరగొడుతుందా?
on Oct 25, 2021
ఇప్పుడంటే `బుట్టబొమ్మ` పూజా హెగ్డే పట్టిందల్లా బంగారమే! కానీ, కెరీర్ ఆరంభంలో మాత్రం అమ్మడు ఏ `వుడ్`లో అడుగేసినా.. ఫలితం పరాజయమే. కోలీవుడ్ లో మొదటి సినిమా అయిన `ముగమూడి`, టాలీవుడ్ లో తొలి చిత్రమైన `ఒక లైలా కోసం`, బాలీవుడ్ డెబ్యూ మూవీ `మొహెంజో దారో`.. ఇలా అన్ని చోట్లా పూజకి చుక్కెదురైంది. ఆ తరువాత కూడా ఒకట్రెండు అపజయాలు పలకరించినా.. `అరవింద సమేత` నుంచి బాక్సాఫీస్ విన్నర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది మిస్ హెగ్డే.
కేవలం తెలుగులోనే కాదు హిందీలోనూ `ఫ్లాప్` హీరోయిన్ ముద్ర చెరిపేసుకుంది. ఆమె రెండో చిత్రం `హౌస్ ఫుల్ 4` డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. వసూళ్ళ పరంగా హిట్ స్టేటస్ కి చేరుకుంది. ఈ క్రమంలో.. దాదాపు పదేళ్ళ తరువాత తమిళనాట మరోసారి అదృష్టపరీక్షకు సిద్ధమైంది పూజా హెగ్డే. ఇళయ దళపతి విజయ్ కి జంటగా పూజ నటిస్తున్న ఆ చిత్రమే `బీస్ట్`. వరుస విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా.. వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి.. తెలుగు, హిందీ భాషల్లో `ఫ్లాప్ హీరోయిన్` ట్యాగ్ కి చెక్ పెట్టిన పూజ.. కోలీవుడ్ లోనూ అదే పరంపరని కొనసాగించి అక్కడ కూడా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.