అసిన్, అనుపమ బాటలో కృతి శెట్టి!
on Jan 13, 2022

గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన `ఉప్పెన`తో తెలుగునాట డ్రీమ్ డెబ్యూ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి ప్రయత్నంలోనే సంచలన విజయం అందుకున్న ఈ క్యూట్ బ్యూటీ.. ఆపై అదే సంవత్సరం చివరలో `శ్యామ్ సింగ రాయ్`తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కట్ చేస్తే.. ఈ సంక్రాంతికి `బంగార్రాజు`తో హ్యాట్రిక్ కి సిద్ధమైంది. కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య టైటిల్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో చైతూకి జంటగా దర్శనమివ్వనుంది కృతి. ఇందులో సర్పంచి నాగలక్ష్మిగా ఎంటర్టైన్ చేయబోతోంది మిస్ శెట్టి. కాగా, రేపు (జనవరి 14) `బంగార్రాజు` థియేటర్స్ లోకి రాబోతోంది.
ఇదిలా ఉంటే.. గతంలో కృతి తరహాలో తెలుగు తెరకు పరిచయమైన తొలి ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసి ఆపై సంక్రాంతి సీజన్ లో మూడో చిత్రంతో పలకరించి హ్యాట్రిక్ అందుకున్న నాయికలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళే.. అసిన్, అనుపమ పరమేశ్వరన్. 2003లో `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`, `శివమణి`తో తెలుగునాట బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన అసిన్.. 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన `లక్ష్మీ నరసింహా`తో హ్యాట్రిక్ కొట్టింది. ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే.. `అ ఆ`, `ప్రేమమ్` చిత్రాలతో 2016లో రెండు వరుస విజయాలు చూసి.. 2017 పొంగల్ స్పెషల్ గా జనవరి 14న జనం ముందుకొచ్చిన `శతమానం భవతి`తో తెలుగునాట హ్యాట్రిక్ అందుకుంది.
మరి.. అసిన్, అనుపమ బాటలోనే కృతి శెట్టి కూడా జనవరి 14నే రిలీజ్ కానున్న `బంగార్రాజు`తో తెలుగునాట హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



