జగన్ శుభవార్త చెప్పారు.. వారం పదిరోజుల్లో ఆమోదయోగ్యమైన జీవో వస్తుంది!
on Jan 13, 2022

ఏపీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారనీ, వారం పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక జోవో వస్తుందనే ఆశాభావంతో ఉన్నాననీ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. గురువారం ఆయన జగన్ ఆహ్వానంతో ఆయన ఇంటికి వెళ్లారు. ఇద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత ఇద్దరూ సమావేశమై ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. జగన్ సతీమణి భారతి తమకు స్వయంగా వడ్డించినట్లు ఆనందపడుతూ చెప్పారు చిరు. చిత్రపరిశ్రమలోని సాధకబాధకాలన్నింటినీ జగన్ విన్నారనీ, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారనీ చెప్పారు. తమ సమావేశం ఫలవంతంగా జరిగిందని ఆయన తెలిపారు. జగన్‌తో మీటింగ్ అనంతరం గన్నవరం విమానాశ్రయం దగ్గర మీడియాతో ఆయన మాట్లాడారు.
"ఒక సోదరునిగా ఆయన నన్ను విందు భోజనానికి ఆహ్వానించి, ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, ఆత్మీయతను కనపర్చిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. దగ్గరుండి శ్రీమతి భారతిగారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంత ఆప్యాయత కనపర్చిన ఆ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు." అని చెప్పారు చిరు.
కొంతకాలంగా ఇండస్ట్రీలో అగమ్యగోచర పరిస్థితి ఉందని తెలిపిన ఆయన, "ఒకపక్క ఏం జరుగుతోందనే అసంతృప్తి, ఇంకో పక్క ఏమైనా సరే మేం ఇండస్ట్రీకి మేలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి.. ఎక్కడో అసంతృప్తి. వీటి మధ్య ఒక కొలిక్కిరాని సమస్య, జఠిలమవుతూ వచ్చిన సందర్భంలో నన్ను జగన్మోహన్‌రెడ్డిగారు రమ్మని ఆహ్వానించి, నిర్ణయం తీసుకునే ముందు ఒకసైడు వినడమే కాదు, రెండో సైడు కూడా విని, దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఒక విధివిధానాన్ని తయారుచేసి, దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అని ఆయన నామీద పెట్టిన భరోసా, నమ్మకం నాకెంతో నిజంగా బాధ్యతగా అనిపించింది. ఈరోజు సామాన్య ప్రజలకు వినోదం అనేది అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని మన్నిస్తూ, అభినందిస్తూ, ఈ పరిశ్రమలో ఉన్న సాదకబాధకాలు, అలాగే ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్ల వారు పడుతున్న సాదకబాధకాలను ఆయనకు సవివరంగా చెప్పాను. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు." అని చెప్పారు.
Also read: జగన్-చిరు లంచ్ మీట్.. టికెట్ల లెక్క తేలుతుందా?
'ఉభయులకూ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను, ఈ విషయాలన్నింటినీ కమిటీకి చెప్తాను, కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది' అని జగన్ తెలిపారనీ, వారన్న దానికి, ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడినదానికి తనకెంతో నమ్మకం ఏర్పడిందనీ చిరంజీవి తెలిపారు. "ఒక్కోసారి థియేటర్లు మూసేసుకోవాల్సిన పరిస్థితులు ఆసన్నమవుతాయన్న ఒక అభద్రతాభావంతో వారంతా ఉన్నారు. వాళ్లందరికీ ఒక ధైర్యం కల్పించే విధంగా, వాళ్ల సాదకబాధకాలను కూడా పరిగణలోకి తీసుకొని నిర్మాణాత్మకమైన సూచనలను వారికి చెప్పాను. వారు సానుకూలంగా స్పందించారు. ఈ రెండో యాంగిల్ నుంచి కూడా ఆయన విషయాలను అవగాహన చేసుకున్నారు." అని చిరంజీవి చెప్పారు.
Also read: సినిమా ఇండస్ట్రీ కష్టాలను ఏపీలో వినిపించుకొనే నాథుడేడీ?
"నేను ఒక పక్షానే ఉండను. అటు ఇటు అందరినీ సమదృష్టితో చూస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన విధివిధానాలను తీసుకుంటాను. కాబట్టి ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం, భయం లేద"ని జగన్ భరోసా ఇచ్చారన్నారు. "దాంతో నాకు ఎనలేని ధైర్యం ఏర్పడింది. అతి త్వరలో ఒక డ్రాఫ్ట్ తయారుచేసి, దానిలోని విషయాలను మళ్లీ మీకు తెలియజేస్తాను, మీద్వారా దాన్ని పరిశ్రమకు తెలియజేసి, అందరికీ ఆమోదయోగ్యం అనుకున్న తర్వాత దాన్ని జీవోగా ఇస్తాం అనే పెద్దమాట అన్నారాయన. ఇది చాలా శుభవార్త." అని చెప్పారు చిరు.
Also read: ఎవరికి బలిసింది.. మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?
"ఇండస్ట్రీలోని వారందరికీ పెద్దగా కాదు, ఒక బిడ్డగా తెలియజేసుకుంటున్నా.. ఎవరూ కూడా ఆందోళనతోటి స్టేట్‌మెంట్లు ఇవ్వద్దు, మాటలు జారొద్దు. పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారన్న నమ్మకం నాకుంది. నా మాటను మన్నించి అందరూ సంయమనం పాటించండి. వారం పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక జోవో వస్తుందనే ఆశాభావంతో ఉన్నాను. చిన్న సినిమాలకు సంబంధించి కూడా ఐదో షో ఉండాలనే కోరికను వారి ముందు పెట్టినప్పుడు దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించి దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం అని అన్నారు." అని ఆయన తెలిపారు.
"మనం చెప్పిన విషయాల్ని ఆయన నామమాత్రంగా కాకుండా లోతుగా అర్థం చేసుకుంటూ అమలుచేయాలన్న ధోరణిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జరిగింది చాలా ఫలవంతమైన మీటింగ్. మా మధ్య జరిగిన చర్చకు సంబంధించిన అంశాలను చాంబర్, కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు సంబంధించిన పెద్దలనందర్నీ పిలిపించి, వాళ్లతో ఒక సమావేశం ఏర్పాటుచేసుకొని, వాళ్లు నేను చెప్పినదానికి మించి సూచనలిస్తే వాటిని కూడా జగన్‌గారిని కలిసి చెప్తాను. 'ఈసారి ఎప్పుడొచ్చినా భోజనానికి కలుద్దామన్నా' అన్నారు. అంత ఆప్యాయంగా సొంతమనిషిగా ఆయన నన్ను చూస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు." అని చెప్పారు చిరు.
"ఇప్పుడు నేను ఒక్కడ్ని అనుకొని రాలేదు, నన్ను ఒక్కడ్ని రమ్మని ఆయన భోజనానికి ఆహ్వానిస్తే వచ్చాను. ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందనే నమ్మకం ఉంది" అని ఆయనన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



