కేరళలా ఆలోచించండి.. తెలుగు రాష్ట్రాల మంత్రులకు కోన వెంకట్ రిక్వెస్ట్
on Jul 2, 2021

కరోనా కాలంలో ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడ్డారు. అయితే చిన్న సినిమాలకు ఇది వరంలా మారిందనే అభిప్రాయముంది. ఒకప్పుడు తమ సినిమాలకు థియేటర్స్ దొరకట్లేదు అంటూ చిన్న నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్నో చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలలో విడుదలై.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా ప్రైవేటు ఓటీటీలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఓటీటీ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది.
ఓటీటీ ప్లాట్ ఫామ్ ను సొంతంగా ప్రారంభించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది అని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ తెలిపారు. చిన్న బడ్జెట్ సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఓటీటీ దిశగా కేరళ మాదిరిగా తెలుగు రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని రచయిత, నిర్మాత కోన వెంకట్ ట్విట్టర్ వేదికగా కోరారు. చిన్న సినిమాల కోసం స్వయంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ని ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా ఉత్తమమైనది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఆలోచన చేస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో మేలు జరుగుతుందని తెలుపుతూ.. తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు.. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కోన వెంకట్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



