ఈసారైనా పవన్ వస్తాడా? రాకపోతే ఇక అంతే..
on Jan 19, 2017

ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవన్ కల్యాణ్ వస్తున్నాడహో...అంటూ పెద్ద హంగామా చేశారు మెగా ఫ్యాన్స్. తీరా చూస్తే పవన్ రాలేదు. ట్విట్టర్‌లో అభినందనలతో సరిపెట్టాడంతే. నాగబాబు - వర్మల పుణ్యమా అని పవన్ గైర్హాజరు పెద్ద లెక్కలోకి రాకుండా పోయింది. ఖైదీ నెం.150 రిలీజ్ హడావుడిలో పడిపోయి.... పవన్ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కృతజ్ఞతాభినందన సభ అంటూ ఒకటి ప్లాన్ చేస్తోంది ఖైదీ టీమ్. ఈ కార్యక్రమానికి చిత్రబృందం యావత్తూ హాజరవుతోంది. ముఖ్య అతిథిగా వవన్ కల్యాణ్ రాబోతున్నాడంటూ ఓ వర్గం ప్రచారం చేస్తోంది. దాంతో అందరి ఫోకస్ పవన్ పై పడింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి డుమ్మా కొట్టిన పవన్.. కనీసం ఈసారైనా వస్తాడా, రాడా?? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ప్రీ రిలీజ్ పంక్షన్‌కి రాని వాడు.. సక్సెస్ మీట్‌కి ఎందుకు వస్తాడు? అని లైట్ తీసుకొంటున్నారు చాలామంది.
అయితే.. పవన్‌ని ఈసారైనా తీసుకురావాల్సిందే అంటూ మెగా బృందం కంకణం కట్టుకొన్నట్టు తెలుస్తోంది. పవన్ వచ్చి... ఈ సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడితే వసూళ్లు మరింత పుంజుకొనే ఛాన్సుందని లెక్కలేస్తోంది చిత్రబృందం. అందుకే మళ్లీ అల్లు అరవింద్, రామ్‌చరణ్ రంగంలోకి దిగిపోయినట్టు తెలుస్తోంది. అందరి ఫంక్షన్లకూ వెళ్లి, అన్నయ్య ఫంక్షన్‌కి వెళ్లకపోతే మరీ బ్యాడ్ అయిపోతాం... అన్న భయం పవన్‌కి ఉంటే కృతజ్ఞతాభినందన సభకి తప్పకుండా వస్తాడు. లేకపోతే.. పవన్‌ని విమర్శించే వాళ్లకు మరో ఆయుధం దొరికినట్టవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



