రివ్యూ : కేశవ
on May 19, 2017
టాలీవుడ్‌లో రివైంజ్ డ్రామాలు కోకొల్లలుగా వచ్చాయి. మరోసారి రివైంజ్ కథ ఎంచుకొంటే.. కచ్చితంగా అందులో కొత్త పాయింట్ ఉండాల్సిందే. 'అందరికీ ఎడమవైపున గుండె ఉంటే.. నాకు కుడి వైపున ఉంది. నేనేం చేసినా ప్రశాంతంగా చేయాలి.. ఆఖరికి మర్డర్‌తో సహా' అంటూ హీరో క్యారెక్టరైజేషన్ ఒక్కడైలాగ్‌లో చెప్పేశారు. డైలాగ్ సింపుల్ గా ఉన్నా - ఈ రివైంజ్ డ్రామాని రసతవ్తరంగా మార్చే ఛాన్స్ దొరికింది. మరి ఈ 'కొత్త పాయింట్తో' 'పాత ఫార్ములా' కథని కేశవ గట్టెక్కించిందా? రివైంజ్ డ్రామా థ్రిల్లర్ ఆడియన్స్‌కి కావల్సిన కిక్ ఇచ్చిందా?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
కేశవ (నిఖిల్) లా స్టూడెంట్. కాలేజీలో కామ్‌గా ఉంటాడు. ఎవ్వరినీ పట్టించుకోడు. చిననాటి స్నేహితురాలు సత్యభామ (రీతూ వర్మ) తన వెంట పడుతున్నా.. దూరంగానే ఉంటాడు. అయితే... కేశవకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఓ దారుణమైన రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోతాడు. దానికి కారణమైన వాళ్లని ఒకొక్కరిపైనా పగ తీర్చుకొంటాడు. ఆ పగ తీర్చుకొనే విధానం ఎలా సాగింది? పోలీసులకు పట్టుబడకుండా కేశవ ఎలా తప్పించుకోగలిగాడు? అనేదే.. 'కేశవ' కథ.
* విశ్లేషణ
సింగిల్ లైన్ లో చెబితే.. ఇది నిజంగా ఫక్తు ఫార్ములా కథనే అనిపిస్తుంది. ఇంత రొటీన్ కథని నిఖిల్ ఎలా ఒప్పుకొన్నాడా అనే డౌటు వస్తుంది. కాకపోతే.. దర్శకుడు ఈ కథని ఓ కొత్త పాయింట్ చుట్టూ అల్లుకొన్నాడు. అదే... హీరో గుండె కుడివైపున ఉండడం. తాను ఎప్పుడూ ఆవేశ పడకూడదు. ఏ పని చేసినా కూల్ గా చేయాలి. అలాంటప్పుడు పగ కూడా అంతే కూల్ గా ఎలా తీర్చుకొన్నాడు అనేది ఆసక్తికలిగించేదే. ఒకటా రెండా?? 5 హత్యల్ని ప్రశాంతంగా చేయాలి. అదెలా అనేది ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెడుతుంది. ఓ మర్డర్... ఆ వెంటనే కాలేజీ సీన్లు... మళ్లీ మరో మర్డర్.. ఆ తరవాత కొంత కామెడీ... విశ్రాంతి వరకూ దర్శకుడు ఇలానే కాలక్షేపం చేశాడు. తొలి భాగం కాస్త గ్రిప్పింగ్‌గానే సాగింది. రెండో భాగం మాత్రం వేగం తగ్గింది. విసుగు మొదలవుతుంది. నిడివి తక్కువైనా సరే... థియేటర్లో చాలా సేపు ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. కథలో చాలా లోపాలున్నాయి. అవన్నీ బయటపెట్టేస్తే.. సినిమా చూస్తున్నప్పుడు ఆమాత్రం ఆసక్తి అయినా ఉండదు. అందుకే సినిమా చూసి మీరే వాటిని కనుక్కోండి. పతాక సన్నివేశాలకు ముందు ఓ ట్విస్టుంది. దాన్నీ దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ కావల్సినదానికంటే ఎక్కువ తీసుకొన్నాడు. దాంతో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్సయ్యాయి.
* నటీనటుల ప్రతిభ
కేశవగా నిఖిల్ కి ఇది కచ్చితంగా డిఫరెంట్ రోలే. ఇది వరకు చాలా ఎనర్జిటిక్ గా కనిపించిన నిఖిల్... ఈ సినిమాలో మాత్రం అండర్ ప్లే చేయాల్సివచ్చింది. సంభాషణలు కూడా చాలా తక్కువ. పెళ్లి చూపులు తరవాత రీతూ వర్మ చేసిన సినిమా ఇది. అయితే... తనది హీరోయిన్ పాత్ర అనుకోకూడదు. జస్ట్ సపోర్టింగ్ రోల్ అంతే. వెన్నెల కిషోర్ అక్కడక్కడ నవ్విస్తాడు. పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శన్ మాత్రం తేలిపోయాడు. సత్య కామెడీ ఒక్కటే సెకండాఫ్‌లో కాస్త రిలీఫ్. ఇషా కొప్పికర్ కూడా చేసిందేం లేదు.
* సాంకేతిక వర్గం
ఈ సినిమాలో పాటలకు స్కోప్ లేదు. రెండు పాటలు ఉన్నా.. అవి బ్యాక్ గ్రౌండ్లోనే వినిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకొంటుంది. ఫొటోగ్రఫీ ఎక్స్‌లెంట్ అనే చెప్పాలి. కొన్ని షాట్స్ అబ్బుర పరుస్తాయి. దర్శకుడిగా సుదీర్ వర్మ పనితనాన్ని తక్కువ చేయలేం. కచ్చితంగా ప్రతిభావంతుడే. కానీ... ఇలాంటి డొల్ల స్క్రిప్టుల్ని నమ్ముకోకూడదు. కథలోనూ బలం ఉంటే.. సుధీర్ తప్పకుండా మంచి సినిమాలు తీయగలడు.
* ఫైనల్ పంచ్ : గుండె జారిపోయింది
* రేటింగ్: 2.25
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
