ENGLISH | TELUGU  

స‌త్య‌నారాయ‌ణ సాహ‌సం సాధార‌ణ‌మైంది కాదు..!

on Jul 24, 2018

 

 

హీరోలుగా మెప్పించ‌గ‌ల న‌టులు కొంద‌రైతే...
విల‌న్స్‌ గా మెరిపించ‌గ‌ల న‌టులు కొంద‌రు.
హాస్యంతో కిత‌కిత‌లు పెట్టించే న‌టులు కొంద‌రైతే..
విషాద‌ర‌సంతో.. హృద‌యాల‌ను ద్ర‌వింప‌జేసే న‌టులు కొందరు..
ఇలా ఒక్కొక్క‌రిదీ ఒక్కో జాన‌ర్‌.
అయితే.. అన్ని జాన‌ర్ల‌లో ఇమిడిపోయే పాద‌ర‌సం లాంటి న‌టులు కూడా కొంద‌రుంటారండోయ్‌..!. ఎలాంటి పాత్ర‌యినా వారికి అర‌చేతిలో ఉసిరికాయే. వారినే మ‌హాన‌టులు అంటారు. ఆ కోవ‌కు చెందిన న‌టుడే  కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. అందుకే ఆయ‌న్నూ.. న‌వ‌ర‌స‌న‌ట‌నా సార్వ‌భౌమ.. అని అంద‌రూ ఇష్టంగా  పిలుచుకుంటూవుంటారు..
స‌త్య‌నారాయ‌ణ విల‌న్‌గా వేస్తే... ఇంత‌కుమించిన దుర్మార్గుడు ఇంకెవ‌రైనా ఉంటారా? అనిపిస్తాడు..
మన‌సున్న మ‌నిషిగా క‌నిపిస్తే... ఇంత‌కంటే మంచివాళ్లు ఉండ‌రేమో... అన్నంత‌గా మెప్పిస్తాడు..
క‌మెడియ‌న్ పాత్ర పోషిస్తే...  స్టార్ క‌మెడియ‌న్ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని కామెడీ చేయ‌డం కైకాల స్పెషాలిటీ..
స‌త్య‌నారాయ‌ణ‌గారు హీరోగా కూడా చేశారండోయ్‌... తొలి సినిమాలో ఆయ‌న హీరోనే. సినిమా పేరు సిపాయి కూతురు. ఆ త‌ర్వాత... నా పేరే భ‌గ‌వాన్‌, మొర‌టోడు చిత్రాల్లో కూడా ఆయ‌న హీరోగా మెప్పించారు.
ఎన్టీయార్‌, ఎస్వీయార్ త‌ర్వాత దుర్యోధ‌నుడంటే కైకాలే.. ఎస్వీయార్ త‌ర్వాత ఘ‌టోత్క‌చుడంటే కైకాలే.. ఇక య‌ముడు అంటే.. ఠ‌పీమ‌ని గుర్తొచ్చేరూపం కైకాల‌దే..

 

 

ఇలా చెప్పుకుంటూపోతే.. లెక్కకుమించిన పౌరాణిక పాత్ర‌లు చేసి మెప్పించిన గొప్ప న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌.
తొలి సినిమా సిపాయి కూతురు ప‌రాజ‌యం అవ్వ‌డంతో.. కైకాల‌ విల‌న్ వేషాల‌వైపు మొగ్గు చూపారు. ప‌ర్యావ‌సానంగా.. రాజ‌నాల వెన‌క‌బ‌డిపోయారు. ఒక ద‌శ‌కు వ‌చ్చేస‌రికి ఎన్టీయార్ న‌టించే ప్ర‌తి జాన‌ప‌ద చిత్రంలోనూ విల‌న్ అంటే కైకాలే. ఈ కార‌ణంగా రాజ‌నాల‌కూ, కైకాల‌కూ అప్ప‌ట్లో పెద్ద‌గా ప‌డేది కాద‌ట‌.

తొలినాళ్ల‌లో స‌త్య‌నారాయ‌ణ రూపం ఎన్టీయార్ కి ద‌గ్గ‌ర‌గా ఉండేది. అందుకే.. చాలా సినిమాల్లో రామారావు డూప్ గా కైకాల న‌టించారు. ఎన్టీయార్ ద్విపాత్రాభిన‌యం చేసిన రాముడు-భీముడు, క‌ద‌ల‌డు-వ‌ద‌ల‌డు, గోపాలుడు-భూపాలుడు, గ‌జ‌దొంగ‌.. త‌దిత‌ర చిత్రాల్లో ఎన్టీయార్  డూప్‌గా కైకాల చ‌క్క‌గా చూడొచ్చు.

వ‌రుస‌గా ఘోర‌మైన విల‌న్ వేషాలు వేస్తున్న స‌త్య‌నారాయ‌ణ‌లో కొత్త‌కోణం ఆవిష్క‌రించిన సినిమా ఉమ్మ‌డికుటుంబం. అందులో భార్యా విధేయుడైన బాధితునిగా న‌టించారు స‌త్య‌నారాయ‌ణ‌. ఆ పాత్ర‌లో ఆయ‌న ఒదిగిన తీరు చూసి జ‌నాలు అవాక్కయ్యారంటే న‌మ్మండి! ఆ త‌ర్వాత అలాంటి హృద్య‌మైన పాత్ర‌లు చాలా పోషించారాయ‌న‌. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవ‌ల‌సిన సినిమా శార‌ద‌. కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శార‌ద అన్న‌య్య‌గా విశ్వ‌రూపం చూపించారు కైకాల‌.

 

డ‌బ్బులోకం దాసోహం, దేవుడు చేసిన మ‌నుషులు చిత్రాల్లో.. కైకాల పోషించిన తాగుబోతు పాత్ర‌లు నిజంగా మెమ‌ర‌బుల్‌.
నిప్పులాంటి మ‌నిషిలో షేర్ ఖాన్ పాత్ర గురించి ఇక చెప్పేదేముంది!
అగ్నిప‌ర్వ‌తంలో స‌త్య‌నారాయ‌ణ చేసిన కామెడీ తేలిగ్గా మ‌రిచిపోలేం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక‌టా రెండా.. న‌టునిగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన మ‌హాన‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. న‌టునిగా ఆయ‌న గురించి చెప్పాలంటే ఓ పుస్త‌కం కూడా చాల‌దు.

మ‌రో విష‌యం ఏంటంటే... దాన‌వీర‌సూర‌క‌ర్ణలో కైకాల భీమునిగా న‌టించారు. లొకేష‌న్లో దుర్యోధ‌నుడిగా ఎన్టీయార్‌ విశ్వ‌రూపాన్ని ప్ర‌త్య‌క్షంగా చూస్తూ...  మ‌రోవైపు దానికి పోటీగా రూపొందుతున్న కురుక్షేత్రం చిత్రంలో తాను దుర్యోధ‌నునిగా న‌టించారు. న‌టించడ‌మే కాదు.. అద‌ర‌హో అనిపించారు. ద‌టీజ్‌ కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. ఇంకా ఇలాంటి స‌వాళ్లు న‌టునిగా ఆయ‌న‌కు ఎన్నో..

నిర్మాత‌గా ర‌మా ఫిలింస్ అనే సంస్థ‌ను స్థాపించి.. గ‌జ‌దొంగ‌, కొద‌మ‌సింహం లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు కైకాల‌.

 

 

 

ఎన్టీయార్‌, స‌త్య‌నారాయ‌ణల‌ అనుబంధం అపురూప‌మైన‌ది. ఇద్ద‌రూ సొంత అన్న‌ద‌మ్ముల్లానే మ‌స‌లేవారు. ఎన్టీయార్ కూడా కైకాల‌ను సొంత త‌మ్మునిగా ఆద‌రించారు. ఆయ‌న న‌టించిన‌, నిర్మించిన‌ ప్ర‌తి సినిమాలోనూ స‌త్య‌నారాయ‌ణ ఉండాల్సిందే. అంత‌టి అనుబంధం వారిద్ద‌రిదీ. అలాంటి కైకాల‌... ప్ర‌స్తుతం ఎన్టీయార్ బ‌యోపిక్‌లో న‌టిస్తుండ‌టం విశేషం. అందులో... హెచ్‌.ఎం.రెడ్డిగా కైకాల న‌టిస్తున్నారు. త‌న బ‌హిప్రాణ‌మైన అన్న‌గారి క‌థ‌లో తాను కూడా భాగ‌మైనందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు కైకాల‌. 

ఇంత‌టి మ‌హాన‌టునికి ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ద్మ పుర‌స్కారం కూడా లేక‌పోవ‌డం ప్ర‌భుత్వాల హీన‌మైన ప‌నితీరుకు నిద‌ర్శ‌నం.
నేడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌గారి పుట్టిన‌రోజు.. ఈ న‌వ‌ర‌స‌న‌ట‌నా సార్వభౌముడు ఇలాంటి పుట్టిన రోజులు మ‌రిన్ని జ‌రుపుకోవాల‌నీ.. ఆయురారోగ్యాల‌తో వ‌ర్థిల్లాల‌ని  కాంక్షిస్తుంది తెలుగువ‌న్‌.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.