'కాల్‌కూట్' వెబ్ సిరీస్ రివ్యూ
on Jul 30, 2023
వెబ్ సిరీస్: కాల్‌కూట్
నటీనటులు: విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, సీమా బిశ్వాస్, సుజనా ముఖర్జీ, యశ్ పాల్ శర్మ, గోపాల్ దత్ తదితరులు
రచన: అరుణభ్ కుమార్
ఎడిటింగ్: కోణార్క్ సక్సేనా
సినిమాటోగ్రఫీ: మనీష్ భట్
సంగీతం: రాఘవ్ అర్జున్
దర్శకత్వం: సుమిత్ సక్సేనా
నిర్మాతలు: అజిత్ అంధరే, అమృతపాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారి
బ్యానర్: ట్రిప్పింగ్ పాయింట్ ఫిల్మ్, వయాకామ్ 18 స్టుడియోస్
ఓటిటి: జియో సినిమా
విజయ్ వర్మ ఇప్పటి వరకు చేసినన్నీ నెగెటివ్ రోల్స్.. మొదటిసారిగా తను పాజిటివ్ రోల్ చేసిన 'కాల్‌కూట్' జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆ కథేంటో ఒకసారి చూసేద్దాం
కథ:
రవిశంకర్ త్రిపాఠి( విజయ్ వర్మ) సబ్ ఇన్స్పెక్టర్ గా ఒక పోలీస్ స్టేషన్ లో చేస్తుంటాడు. రవిశంకర్ డ్యూటీలో జాయిన్ అయి మూడు నెలలే అవుతుంది. అయితే అతనికి ఈ పోలీస్ ఉద్యోగం అంతగా ఇష్టం ఉండదు. రవిశంకర్ వాళ్ళ నాన్న చనిపోవడంతో, వాళ్ళ అమ్మని చూసుకునే బాధ్యత అతని మీదే ఉంటుంది. ఆయితే అతని పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి కేసు వస్తుంది. దానిని ఇన్వెస్టిగేషన్ చేయమని రవిశంకర్ పైఅధికారి జగదీశ్ అతనికి చెప్తాడు. మూడు నెలల నుండి ఆ స్టేషన్ లో జరుగుతున్నవన్నీ చూసిన రవిశంకర్ త్రిపాఠి తన రాజీనామాను జగదీశ్ కి ఇస్తాడు. అయితే ఈ యాసిడ్ దాడి కేసు సాల్వ్ చేస్తేనే నీ రాజీనామా లెటర్ మీద సంతకం చేస్తానని జగదీశ్ చెప్తాడు. మరి రవిశంకర్ యాసిడ్ దాడి కేసును పరిష్కారించాడా? అతనికి ఆ యాసిడ్ దాడికి గురైన అమ్మాయికి గల సంబంధం ఏంటి? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
యాసిడ్ దాడికి గురైన ఒక అమ్మాయి, ఈ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న రవిశంకర్ త్రిపాఠి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే పోలీస్ జాబ్ అంటే ఇష్టం లేని రవిశంకర్ త్రిపాఠి ఈ కేస్ ని ఎలా పరిష్కారించాడనేదే ఈ కథ. రవిశంకర్ కి పెళ్ళి చేయాలని చూసే అమ్మ ఒకవైపు, తన మాట వినకుండా నచ్చినవాడితో వెళ్ళిపోయిన చెల్లి ఒకవైపు, టార్చర్ చేసే అతని పైఅధికారి జగదీశ్.. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఈ పోలీస్ జాబ్ ఇష్టం లేని రవిశంకర్ త్రిపాఠి ఏం చేశాడనేది ఒక్కో ఎపిసోడ్‌లో చూపిస్తూ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తించారు.
మొదటి భాగం "జన్మ్ దిన్" లో యాసిడ్ దాడిని చూపించగా, సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్న రవిశంకర్ రాజీనామా చేయాలని చూస్తుంటాడు. అయిష్టంగానే తన లైఫ్ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రెండవ భాగం "ఎమ్ ఫర్ మాఫియా" లో రవిశంర్ కేస్ ని దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు. అసలు పోలీస్ జాబ్ అంటే ఇష్టం లేని రవిశంకర్ కి వాళ్ళ నాన్న రాసిన లెటర్ లోని కొన్ని మాటలు అతడిని ఇన్ స్పైర్ చేస్తాయి. దాంతో రవిశంకర్ ఏ పని చేసినా సక్రమంగా, నియమాలను పాటిస్తూ, క్రమశిక్షణతో చేయాలని నిర్ణయించుకుంటాడు. యాసిడ్ దాడికి గురైన అమ్మయి 'పారుల్' అని తెలుసుకుంటాడు. అయితే ఆ అమ్మాయి ఒక వేశ్య అని మొదటిసారి తెలుస్తుంది. విచారణ చేస్తున్నకొద్దీ అసలు పారుల్ వేశ్యనా కాదా అనేది రవిశంకర్ తెలుసుకునే ప్రయత్నాలు ఎంగేజింగ్ గా ఉంటాయి.
యాసిడ్ దాడికి గురైన పారుల్ ఫోన్ లిస్ట్ లో మృదుల్ అనే వ్యక్తికి ఎక్కువ సార్లు కాల్ చేసినట్టు తెలుసుకున్న రవిశంకర్.. అతనెవరో కనుక్కునే విధానం, తీరా మృదుల్ ఎవరో తెలిసాక, పారుల్ పై దాడి చేసింది తను కాదని వేరే అతను ఉన్నాడని తెలిసాక మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో క్లూని కనిపెడుతూ రవిశంకర్ తన డ్యూటీని సక్రమంగా చేస్తుంటాడు. రవిశంకర్ వక్తిగత జీవితం గురించి చూపించడం స్లోగా సాగుతుంది. అవన్నీ అనవసరమని అనిపిస్తుంది. ఒక్కో సిరీస్ నిడివి 35 నుండి 40 నిమిషాల వరకు ఉంటుంది. ఇది ప్రేక్షకుల ఓపికకి పరీక్ష లాంటిదే.
రవిశంకర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సిరీస్ ని నడిపిస్తూ, ఆ ఇన్వెస్టిగేషన్ లో వచ్చే పాత్రలకి ప్రాముఖ్యతను ఇస్తూ చివరివరకు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు మేకర్స్. ఈ సిరీస్ కోసం డైరెక్టర్ సుమిత్ సక్సేనా ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దానిని అంతే జాగ్రత్తగా తీసినట్టు తెలుస్తుంది. విజయ్ వర్మని పాజిటివ్ పాత్రలో బాగా చూపించాడు. రాఘవ్ అర్జున్ నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కోణార్క్ సక్సేనా ఎడిటింగ్ మామూలుగా ఉంది. ఇంకా కొన్ని సీన్లకు కత్తెర వాడాల్సింది. మనీష్ భట్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
రవి శంకర్ త్రిపాఠి పాత్రలో విజయ్ వర్మ ఈ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచాడు. ఒకవైపు ఇష్టం లేని పోలీస్ ఉద్యోగంలో ఒత్తిడి, మరొకవైపు పర్సనల్ లైఫ్ లో తను ఎదుర్కుంటున్న సమస్య మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ పాజిటివ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. రవిశంకర్ త్రిపాఠికి సపోర్ట్ గా యాదవ్ పాత్రలో యశ్ పాల్ శర్మ ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ 'కాల్‌కూట్' సిరీస్ లో విజయ్ వర్మ ఇన్వెస్టిగేషన్ ప్రధాన బలం. అక్కడక్కడ కొన్ని అనవసర సీన్లు వదిలేస్తే ఈ సిరీస్ ని ఒకసారి చూసేయొచ్చు.
రేటింగ్: 2.5/5
✍🏻.దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
